పీహెచ్ డీ సబ్ మిషన్ కాల పరిమితిని పెంచాలె : ప్రొఫెసర్ హరగోపాల్ 

పీహెచ్ డీ సబ్ మిషన్ కాల పరిమితిని పెంచాలె : ప్రొఫెసర్ హరగోపాల్ 

ఓయూ పీహెచ్ డీ విద్యార్థుల ఫోరం డిమాండ్ 

హైదరాబాద్ : పీహెచ్ డీ సబ్ మిషన్ కాల పరిమితిని పెంచాలని ప్రభుత్వాన్ని ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్ డీ విద్యార్థుల ఫోరం డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విద్యార్థుల ఫోరం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హరగోపాల్,విశ్రాంత ఆచార్యులు పి.ముత్తయ్య హాజరయ్యారు. 

ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఆచరించే విధానానికి విరుద్ధంగా పీహెచ్ డీ అడ్మిషన్లను రద్దుచేసి.. బలహీనవర్గాలను విద్యకు దూరం చేస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కోవిడ్ 19 మినహాయింపు కూడా ఇవ్వకుండా పీహెచ్ డీలో ప్రవేశించిన  8 సంవత్సరాలకు వందల మంది విద్యార్థుల పీహెచ్ డీ ప్రవేశాలను రద్దు చేయడం విద్యార్థుల విద్యా హక్కును కాలరాయడమే అని వ్యాఖ్యానించారు. ఇలాంటి నిర్ణయం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధనలపై ఖర్చు చేసిన విలువైన ప్రజాధనం వృథా అవుతుందన్నారు. 

2016 నుండి పరిశోధనలపై కృషి చేస్తున్న విద్యార్థులకు న్యాయం జరిగేలా పరిశోధనా పత్రాలను సమర్పించేందుకు 6 నెలల నుండి సంవత్సరం పాటు వెసులుబాటు కల్పించి.. పరిశోధక విద్యార్థుల విద్యాహక్కులను కాపాడాలని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సీహెచ్ మురళి,కో కన్వీనర్ కనకారెడ్డి, మల్లేష్ యాదవ్,కృష్ణ పాల్గొన్నారు.