పొత్తుల భూమిని కూతురు పేరిట రాసిందని.. పెద్దమ్మను కత్తితో పొడిచి చంపేసిండు

పొత్తుల భూమిని కూతురు పేరిట రాసిందని.. పెద్దమ్మను కత్తితో పొడిచి చంపేసిండు
  •     ఖమ్మం సిటీలో దారుణం

ఖమ్మం టౌన్,వెలుగు: ఇంటి ముందు కూర్చొని మిరపకాయల తొడిమలు తీస్తున్న పెద్దమ్మను కత్తితో పొడిచి చంపేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడేనికి చెందిన మోటె రాములమ్మ(70), యాదగిరి దంపతులు బతుకుదెరువు కోసం ఖమ్మం వచ్చి బొక్కలగడ్డ ప్రాంతంలో జీవిస్తున్నారు. 

యాదగిరి ఫ్యామిలీకి నాతాళ్లగూడెంలో ఐదెకరాల భూమి ఉంది. ఈ భూమిని యాదగిరి చనిపోయిన తరువాత రాములమ్మ తన కూతురు పేరిట రాసింది. ఫ్యామిలీలో యాదగిరి పెద్దవాడు కావడంతో అతని పేరుపైనే ఐదెకరాల భూమి ఉంంది. ఆయన చనిపోయిన తరువాత రాములమ్మ పేరుపై ఆ భూమి బదిలీ అయినట్లు తెలుస్తోంది. 

ఈ విషయంలో యాదగిరి తమ్ముడి కొడుకులతో గొడవలు జరుగుతున్నాయి. భూమిని రాములమ్మ కూతురు సాగు చేస్తుండడంతో ఇటీవల పంచాయితీ నిర్వహించారు. ఈ వివాదం పరిష్కారమయ్యేంత వరకు భూమి ఎవరూ సాగు చేయవద్దని తీర్మానించారు. అయినప్పటికీ రాములమ్మ కూతురు భూమిని సాగు చేస్తుండడంతో రాములమ్మ మరిది కొడుకు శేఖర్  గురువారం సాయంత్రం రాములమ్మ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. 

ఇంటి ముందు కూర్చొని ఉన్న రాములమ్మను వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతీలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రాములమ్మ అక్కడికక్కడే చనిపోయింది. అడ్డుగా వచ్చిన మహేశ్​ అనే వ్యక్తిని కూడా శేఖర్  గాయపరిచాడు. ఆ తర్వాత నిందితుడు త్రీ టౌన్  పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.