2026 ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద తొలి భారీ విజయం నమోదు చేసుకోవడానికి కొత్త సినిమా రంగంలోకి దిగింది. మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా, రాకేష్ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీలకంఠ’ (Nilakanta) చిత్రం (జనవరి 2న) విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఒక వినూత్నమైన పాయింట్‌తో, పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తోంది. ఈ మేరకు ఫుల్ రివ్యూ తెలుసుకోవడానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. నీలకంఠ కథ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం..
కథేంటంటే:
సరస్వతిపురం అనే గ్రామంలో కట్టుబాట్లు, క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద రాఘవయ్య (రాంకీ) ఇచ్చే తీర్పులే శాసనం. అయితే ఇక్కడ ఇచ్చే శిక్షలు చాలా వెరైటీగా ఉంటాయి. ఊరిలోని టైలర్ నాగభూషణం (కంచరపాలెం రాజు) కొడుకు నీలకంఠ (మాస్టర్ మహేంద్రన్) 10వ క్లాస్ చదివేటప్పుడు చేసిన ఒక తప్పుకి.. అతను 15 ఏళ్ల పాటు ఊరు దాటకూడదని, పై చదువులు చదవకూడదని రాఘవయ్య శిక్ష విధిస్తాడు.
తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక చదువుకి దూరమైన నీలకంఠ.. తన బాధను కబడ్డీ ఆటలో చూపిస్తాడు. మరోవైపు తన చిన్ననాటి స్నేహితురాలు, సర్పంచ్ (బబ్లూ పృథ్వీ) కుమార్తె సీత (యాశ్న ముత్తులూరి) పైచదువుల కోసం ఊరు దాటి వెళ్తుంది. 15 ఏళ్ల తర్వాత సీత తిరిగి రావడం, వారి ప్రేమాయణం.. ఆ తర్వాత నీలకంఠ తన ఉనికి కోసం, తన ప్రేమ కోసం సర్పంచ్ పదవికి పోటీ చేయాల్సి రావడం వంటి ఆసక్తికర పరిణామాలతో కథ ఉత్కంఠగా సాగుతుంది.
విశ్లేషణ:
సాధారణంగా సినిమాల్లో తప్పు చేస్తే ఊరి నుంచి వెలివేయడం చూస్తాం. కానీ ఈ సినిమాలో "ఊరిలోనే ఉంచి, తనకు ఇష్టమైన చదువును, ప్రపంచాన్ని దూరం చేయడం" అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. నాన్-లీనియర్ పద్ధతిలో సాగే కథనం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. ఫస్టాఫ్ అంతా ఎమోషనల్ జర్నీతో సాగి, ఇంటర్వెల్ వద్ద ఒక భారీ సస్పెన్స్‌తో ముగుస్తుంది. సినిమా ద్వితీయార్ధం కబడ్డీ మ్యాచ్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్, పొలిటికల్ ఛాలెంజ్‌లతో చాలా వేగంగా సాగుతుంది. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ ఆడియన్స్ చేత ఈలలు వేయిస్తాయి.
నటీనటుల ప్రతిభ:
హీరో మాస్టర్ మహేంద్రన్ తన నటనలో పరిణతి చూపించాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ.. యాక్షన్ సీన్స్‌లోనూ ఎంతో సెటిల్డ్‌గా నటించి సినిమాను భుజాన వేసుకున్నాడు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. యాశ్న ముత్తులూరి సీత పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయింది. నేహా పఠాన్ తన పరిధి మేరకు బాగా చేసింది.
నీలకంఠలో లక్కీ భాస్కర్ తర్వాత రాంకీ పవర్‌ఫుల్ రోల్‌లో మెరిశారు. బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్ వంటి సీనియర్లు తమ నటనతో సినిమాకు బలాన్నిచ్చారు. సినిమాలో ముఖ్యంగా దాదాపు దశాబ్దం తర్వాత స్నేహ ఉల్లాల్ స్పెషల్ సాంగ్‌లో మెరవడం ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఆమె గ్రేస్ అద్భుతంగా ఉంది.
దర్శకుడు రాకేష్ మాధవన్ ఒక కొత్త దర్శకుడైనా, ఇంత భారీ తారాగణాన్ని హ్యాండిల్ చేసిన తీరు అభినందనీయం. మార్క్ ప్రశాంత్ అందించిన సంగీతం 'వింటేజ్' ఫీల్‌ని ఇస్తే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. శ్రవణ్ జి కుమార్ ఎడిటింగ్ రిఫ్రెషింగ్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను చాలా రిచ్‌గా చూపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీ హైలైట్ అని చెప్పాలి. అనిల్ ఇనుమడుగు,కృష్ణ గారు రాసిన పాటల లిరిక్స్ ప్రేక్షకులను ఒక్కసారిగా వింటేజ్ వైబ్స్ లోకి తీసుకెళ్లాయి.
చివరి మాట:
'నీలకంఠ' కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు.. బలమైన కంటెంట్ ఉన్న సినిమాగా 2026లో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యం, పంతాలు, పౌరుషాల మధ్య సాగే ఈ చిత్రం సంక్రాంతి ముందే బాక్సాఫీస్ వద్ద 'హిట్' టాక్ తెచ్చింది. కుటుంబంతో కలిసి చూడదగ్గ ఒక చక్కని రూరల్ డ్రామా కావటంతో ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.
