బీఆర్ఎస్​ను ఓడించాలి.. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ ప్రోగ్రామ్

బీఆర్ఎస్​ను ఓడించాలి.. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో  ప్రతిజ్ఞ ప్రోగ్రామ్

ఓయూ, వెలుగు :  తొమ్మిదేండ్లుగా విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసిన బీఆర్ఎస్​ను ఓడించాలని ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ శనివారం ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ప్రతిజ్ఞను కౌన్సిల్ సహాయ కార్యదర్శి ఆరెకంటి భగత్ చదివి వినిపించారు. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి స్టూడెంట్లు, నిరుద్యోగులను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్​ను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.

 కొట్లాడి సాధించిన తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. పరీక్షలు నిర్వహించడంలో టీఎస్​పీఎస్సీ విఫలమైందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రొఫెసర్లు, స్టూడెంట్లు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులపై ఉపా కేసులు పెడుతున్నదని విమర్శించారు. ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గ్యార నరేశ్, ఓయూ కార్యదర్శి నెల్లి సత్య, హైదరాబాద్ అధ్యక్షుడు చైతన్య యాదవ్, ఓయూ అధ్యక్షుడు ఇరిగి లెనిన్ తదితరులు పాల్గొన్నారు.