అక్టోబర్ 31న ఉస్మానియా వర్సిటీ 83వ కాన్వొకేషన్.. హాజరుకానున్న గవర్నర్

అక్టోబర్ 31న ఉస్మానియా వర్సిటీ 83వ కాన్వొకేషన్.. హాజరుకానున్న గవర్నర్
  • 1,325 మందికి పట్టాలు, 45 మందికి 57  గోల్డ్ ​మెడల్స్ 
  • గౌరవ డాక్టరేట్ అందుకోనున్న ఓయూ ఓల్డ్ స్టూడెంట్, అడోబ్​సీఈవో శాంతన్ నారాయణ్​

సికింద్రాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ 83వ కాన్వొకేషన్​ను ఈ నెల 31న వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ఈ కాన్వొకేషన్​లో 1,325 మంది స్టూడెంట్లకు, పారిశ్రామిక వేత్తలకు, ఎమ్మెల్యేలకు, జడ్జి, జర్నలిస్టులకు  డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. గురువారం ఓయూ గెస్ట్ హౌస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీసీ మాట్లాడారు.

వర్సిటీ చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై అధ్యక్షత వహిస్తారని,  చీఫ్​గెస్టుగా ఓయూ ఓల్డ్ స్టూడెంట్  అడోబ్ సీఈవో శాంతన్ నారాయన్ హాజరై గౌరవ డాక్టరేట్ అందుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు లా విభాగంలో 30, సాహిత్యంలో 12, సైన్స్​లో  6 గౌరవ డాక్టరేట్లను ఓయూ ప్రదానం చేసిందని ఆయన గుర్తు చేశారు. జూలై 2021 నుంచి జూలై 2022 వరకు వివిధ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లకు గోల్డ్​ మెడల్స్ ప్రదానం చేస్తామన్నారు. మొత్తం 57 గోల్డ్ మెడల్స్​ను 45 మంది స్టూడెంట్లకు ప్రదానం చేయనున్నామని.. వారిలో ఆరుగురు అబ్బాయిలు, 39 మంది అమ్మాయిలు ఉన్నారన్నారు.

979 మంది పీహెచ్​డీ పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 608 మంది పురుషులు, 371 మంది మహిళలు ఉన్నారని వీసీ రవీందర్  పేర్కొన్నారు. అధికంగా  272 మంది ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ నుంచి, 189 మంది ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి పీహెచ్​డీ పట్టాలు అందుకోనున్నట్లు ఆయన చెప్పారు. పట్టాలు అందుకునేందుకు దరఖాస్తు చేసుకోని వారు ఎగ్జామినేషన్ బ్రాంచి నుంచి తీసుకోవచ్చన్నారు. పేర్లు నమోదు చేసుకున్నవారు కంట్రోలర్ ఆఫీసు నుంచి ఎంట్రీ పాస్, ఐడీ కార్డులను పొందాలని సూచించారు. గోల్డ మెడల్ స్వీకరించనున్న వారి వెంట ఒకరిని మాత్రమే అనుమతిస్తామని , పీహెచ్​డీ పట్టాలు స్వీకరించబోయే వారి వెంట ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.

మీడియా ప్రతినిధులకు పీఆర్వో ఆఫీసు నుంచి పొందిన పాస్ ద్వారా మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు, ఓఎస్టీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, పీఆర్వో ప్రొఫెసర్ ప్యాట్రిక్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధికారులు పాల్గొన్నారు.