
రైనీ సీజన్... అందులోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఈ చల్లటి వాతారణం జనాలను జలుబు.. దగ్గు వేధిస్తాయి. ఇలాంటి వాటినుంచి విముక్తి కలగాలంటే గరం గరం పుదీనా రసంతో అన్నం తింటే... జలుబు.. దగ్గు ఇట్టే మాయమవుతాయి. పుదీనా రసాన్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
తెలుగు ఇళ్లలో ఎక్కువగా చేసుకునే వంటల్లో చారు, సాంబారుతోపాటు రసం కూడా ఒకటి. లంచ్, డిన్నర్.. ఇలా ఏ టైంలోనైనా, అన్నం, రసం కాంబినేషన్లో తింటే సంతృప్తిగా ఉంటుంది. అయితే రసం అంటే ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా, కొత్తగా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. అందుకే ఇంట్లో సింపుల్ గా తయారు చేసుకోవచ్చు.
పుదీనా రసం తయారీకి కావలసినవి
- కందిపప్పు: ఒక కప్పు
- కొత్తిమీర తరుగు: అర కప్పు
- నెయ్యి: ఒక టీ స్పూన్
- ఆవాలు: ఒక టీ స్పూన్
- వెల్లుల్లి తరుగు: ఒక టీ స్పూన్
- ఉప్పు: తగినంత
- పసుపు: అర టీ స్పూన్
- టొమాటో ముక్కలు: ఒక కప్పు
- చింతపండు: యాభై గ్రాములు
- పుదీనా ఆకులు: పావు కప్పు
- కొబ్బరి తురుము: రెండు టేబుల్ స్పూన్స్
- కరివేపాకు: పది రెమ్ములు
- జీలకర్ర: ఒక టీ స్పూన్
- కొత్తిమీర : ఒక కట్ట
- ఎండుమిర్చి: రెండు
- మిరియాలు: ఒక టీ స్పూన్
తయారీ విధానం : కందిపప్పును మెత్తగా ఉడికించాలి.పుదీనా ఆకులు, కొబ్బరి తురుము, మిరియాల పొడి, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర తరుగు వేసి సన్నని మంట మీద వేగించి, పొడి చేయాలి. ఒక స్టవ్ పై మూకుడు పెట్టి, రెండు కప్పుల నీళ్లు పోసి, టొమాటో ముక్కలు, పసుపు, చింతపండు రసం, ఉప్పు వేసి ఉడికించాలి.
ఇందులోనే ఉడికించుకున్న కందిపప్పు వేసి, మరికొద్దిసేపు ఉడికించాలి. దీనిలో పొడి చేసి పెట్టుకున్న మిశ్రమం వేయాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉడికిస్తే చాలు. నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, దంచిన వెల్లుల్లి వేసి తాలింపు పెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పప్పులో వేస్తే చాలు. చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేస్తే పుదీనా రసం రెడీ.