ఆన్ లైన్ లో పన్ను కట్టేవారికి ఓటీపీ తిప్పలు

ఆన్ లైన్ లో పన్ను కట్టేవారికి ఓటీపీ తిప్పలు

“ జగద్గిరిగుట్టకు చెందిన అనిల్​ఇంటి పన్ను ఎంత ఉందో తెలుసుకుని కట్టేందుకు మొబైల్​లో బల్దియా వెబ్​సైట్​ఓపెన్​చేసి చూశాడు. ఇంటి అసెస్​మెంట్ నంబర్, ఓనర్​ పేరు, మొబైల్​ నంబర్​తో పాటు ఓటీపీ ​అడుగుతోంది. బల్దియా తెచ్చిన కొత్త విధానం కారణంగా మొబైల్ నంబర్​తో పాటు ఓటీపీ ఎంటర్​చేస్తేనే ఆస్తిపన్ను వివరాలు తెలుస్తాయి. అతడు ప్రస్తుతం కొత్త మొబైల్​ నంబర్ ​ఎంటర్ చేస్తే ఇన్​వ్యాలిడ్ ​అని చూపించింది. గతంలో మొబైల్ ​నుంచే ఆన్​లైన్​లోనే కట్టాడు. ఈసారి కూడా చెల్లించేందుకు కొత్త నంబర్​ను అందులో అప్​డేట్ చేద్దామంటే  ఆప్షన్ ​లేదు. దీంతో మీ సేవకు వెళ్లి పన్ను చెల్లించాడు. ’’ 

హైదరాబాద్​, వెలుగు : ఆస్తి పన్ను ఎంత ఉందో ఆన్​లైన్​లో తెలుసుకుని కడదామంటే  మొబైల్ నంబర్, ఓటీపీ  తప్పనిసరి కావడంతో పన్నుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బల్దియా కొద్దిరోజుల కిందట ఈ కొత్త విధానం అమల్లోకి తేవడంతో ఆన్​లైన్​లో చూసుకుని, చెల్లిద్దామనుకునే వారికి ప్రాబ్లమ్స్​వస్తున్నాయి.  పన్ను ఎంత ఉందో తెలుసుకుని, వెంటనే కట్టాలంటే ఓటీపీ కావాల్సి ఉంది. పాత నంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకున్నవారు, ప్రస్తుతం కొత్తవి వాడుతుండటంతో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో పన్ను కట్టేవారు బల్దియా జోనల్​, సర్కిల్​ఆఫీసులకు  క్యూ కడుతున్నారు. అక్కడ కూడా టెక్నికల్ ​ప్రాబ్లమ్స్​కారణంగా గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని  పన్నుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి బల్దియాకు రావాల్సిన ఆస్తి పన్ను భారీగా తగ్గింది. ఇది రాకముందు రోజుకు రూ. కోటి నుంచి రూ. కోటిన్నర వరకు ఆదాయం వచ్చేది.  ప్రస్తుతం రూ.20 నుంచి రూ.30 లక్షలకు పడిపోయింది. గ్రేటర్​లో 13 లక్షల మంది పన్నుదారులు ఉన్నారు. ఇందులో 50 శాతం మంది ఆన్​లైన్​లోనే  చెల్లిస్తున్నారు. మిగతా వారు బిల్​ కలెక్టర్లకు, సీఎస్​సీ సెంటర్లు, మీ సేవా సెంటర్లకు వెళ్లి కడుతుంటారు. ఇప్పుడు ఆన్​లైన్ ​చెల్లింపులు 60 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. బిల్ ​కలెక్టర్​కు, మీసేవా సెంటర్లకు వెళ్లి చెల్లించేవారు ఎక్కువయ్యారు. గత పది రోజుల్లో  కేవలం రూ. 6 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది.  

ఆఫీసులకు వెళ్తుండగా..

గతంలో వెబ్​సైట్​లో సర్కిల్, ప్రాపర్టీ ట్యాక్స్​నంబర్,  ఓనర్​పేరు, డోర్​నంబర్, స్థానిక  వివరాలు ఎంటర్​ చేసి పన్ను ఎంత ఉందో ఈజీగా తెలుసుకొని వెంటనే ఆన్​లైన్​లో  చెల్లించేవారు. ప్రస్తుతం వీటితో పాటు సెల్ ​నంబర్, ఓటీపీ​అడుగుతుండగా, రిజిస్ర్టేషన్​ చేసుకున్నప్పటి మొబైల్​ నంబర్​ లేనివారు కొత్త నంబర్​ఎంటర్​చేస్తే తప్పుగా చూపిస్తోంది. కరెక్ట్ ​నంబర్​ ఉంటేనే ఓటీపీ వస్తోంది. ​నంబర్ అప్​డేట్ కోసం బల్దియా ఆఫీసులకు వెళ్లి  ప్రస్తుత మొబైల్ ​నంబర్​తో రిజిస్ట్రేషన్ ​చేయమని పన్నుదారులు కోరుతున్నారు. 

 తగ్గిన ఆదాయం 

గతేడాది బల్దియాకు రూ. 1,703 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఆ ఏడాది జులై నాటికే 50 శాతం వరకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం రూ. 671 కోట్లు మాత్రమే వసూలైంది. గతేడాదితో పోల్చితే ఆదాయం తగ్గింది.  ఓటీపీ కారణంగా  పన్ను ఎంత ఉందో తెలియకపోవడంతో చాలామంది వెంటనే కట్టకుండా  వాయిదా వేస్తున్నారు. 

ప్రగతిభవన్​ పెండింగ్ బిల్లునే కారణం ?

ప్రగతి భవన్ ఆస్తిపన్ను సుమారు రూ.25 లక్షల 49 వేల 914 బకాయిపై ఈనెల మొదట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో రెండు, మూడురోజుల్లోనే బల్దియా ఓటీపీ విధానం ద్వారా తెలుసుకునే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ఆస్తిపన్ను పెండింగ్​ వివరాలకు ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాతనే తెలుసుకునే పరిస్థితి వచ్చింది. 

మొబైల్ ​నంబర్ ​మార్చుకుందామంటే.. 

ఆన్​లైన్​ నుంచి​ పన్ను కట్టేందుకు ముందుగా ఎంత అమౌంట్​ఉందో తెలుసుకోవాలని  వెబ్​సైట్​ఓపెన్​చేసి చూస్తే ఓటీపీ అడు గుతుంది. నా ​పాత మొబైల్ నంబర్​​ను ప్రస్తుతం వాడడం లేదు.  కొత్త నంబర్​కు మార్చుకుందామంటే ఆప్షన్ లేదు.  బల్దియా కొత్త విధానం అమల్లోకి తెచ్చే ముందు ఇబ్బందులు రాకుండా చూడాల్సింది. ఆఫీసుకు వెళ్లి కడదామంటే ఎక్కువమంది ఉంటుండగా, కరోనాతో భయంగా ఉంది. 
- విజయలక్ష్మి, కవాడిగూడ