ఎదురులేని ఓటీటీ మార్కెట్

ఎదురులేని ఓటీటీ మార్కెట్
  • ఎదురులేని ఓటీటీ మార్కెట్
  • 79 శాతానికి చేరిన వాటా
  • ఏటా 20 శాతం సీఏజీఆర్​ సాధించే చాన్స్​
  • వెల్లడించిన డెలాయిట్ రిపోర్టు

న్యూఢిల్లీ: ఇండియా ఎంటర్​టైన్​మెంట్​ మార్కెట్లో ఓవర్-ది-టాప్ (ఓటీటీ) సర్వీసుల హవా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దీని మార్కెట్ వాటా 7-9 శాతానికి చేరుకుంది. వీడియో స్ట్రీమింగ్ మార్కెట్ 20 శాతం కంటే ఎక్కువ సీఏజీఆర్​ సాధిస్తుందని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది. వీటిలోకి పెట్టుబడుల విలువ రాబోయే పదేళ్లలో 15 బిలియన్ల డాలర్లకు (దాదాపు రూ.1.12 లక్షల కోట్లు)చేరుకుంటుంది.  పెయిడ్ యూజర్ల సంఖ్య కూడా 17శాతం సీఏజీఆర్​తో పెరుగుతుందని అంచనా.  ప్రస్తుతం వీరి సంఖ్య 10.2 కోట్లు కాగా, 2026 నాటికి 22.4 కోట్లకు చేరుకుంటుందని డెలాయిట్  'ఆల్ అబౌట్ స్క్రీన్స్' రిపోర్టు పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం...  ఒరిజినల్ కంటెంట్‌‌లో భారీ పెట్టుబడి, ధరల్లో తగ్గుదల, తక్కువ డేటా ఖర్చులు  షార్ట్-ఫారమ్ కంటెంట్ పెరుగుదల వల్ల ఓటీటీ ఇండస్ట్రీ  గ్రోత్ సాధిస్తోంది. ఓటీటీ ప్లాట్‌‌ఫారమ్‌‌లు 2021లో కంటెంట్‌‌ కోసం 665 మిలియన్ల డాలర్లు (దాదాపు రూ.ఐదు వేల కోట్లు) పెట్టుబడి పెట్టాయి. నెట్‌‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో  డిస్నీ+ హాట్‌‌స్టార్  380 మిలియన్ల డాలర్ల ఇన్వెస్ట్​మెంట్​తో (దాదాపు రూ.2,839 కోట్లు) మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయి.

ప్రాంతీయ భాషల హవా..
ఓటీటీ ప్లాట్‌‌ఫారమ్‌‌లలో ప్రాంతీయ భాషల కంటెంట్ వాటా 2019లో 30శాతం నుండి 2025 నాటికి 50 శాతం దాటుతుంది. హిందీ కంటెంట్ వాటా 45శాతానికి తగ్గనుంది. మనదేశంలో వీడియో స్ట్రీమింగ్ సేవలను అందించే మార్కెట్ చాలా విస్తరించింది. ప్రస్తుతం 40 కంటే ఎక్కువ స్ట్రీమింగ్ ప్లేయర్‌‌లు కస్టమర్ పర్సు కోసం పోటీ పడుతున్నారు. గ్లోబల్ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు  అమెజాన్, డిస్నీ యాజమాన్యంలోని హాట్‌‌స్టార్, సోనీలివ్,  నెట్‌‌ఫ్లిక్స్ వంటివి,  దేశీయ సర్వీస్ ప్రొవైడర్‌‌ర్లు జీ5, వూట్  ఎమ్‌‌ఎక్స్ ప్లేయర్ వంటివి, అలాగే ప్రాంతీయ  అల్ట్రా-లోకలైజ్డ్ ప్లేయర్లు పోటీపడుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లతోపాటు ఎన్ఆర్ఐల నుంచి భారతీయ కంటెంట్​కు భారీగా డిమాండ్ ఉంది. అందుకే ప్రాంతీయ కంటెంట్  ప్లాట్‌‌ఫారమ్‌‌లు దూసుకెళ్తున్నాయి.   యూజర్ల సంఖ్యను పెంచడానికి మొదట్లో వీడియో -ఆన్- డిమాండ్ (ఏవీఓడీ) కంపెనీలు తక్కువ ధరలతో సర్వీసులను ఆఫర్ చేశాయి. అయితే, భవిష్యత్తులో సబ్‌‌స్క్రిప్షన్ -ఆధారిత వీడియో- ఆన్ -డిమాండ్ (ఎస్వీఓడీ) మోడల్ మరింత బలపడటానికి అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో పెయిడ్ యూజర్లు 17శాతం సీఏజీఆర్​తో పెరుగుతారని అంచనా.

ఓటీటీలవైపు చిన్న సిటీలు
ఇప్పుడున్న దశకు చేరుకోవడానికి ఓటీటీ ప్లేయర్లు భారీగా ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి అయింది.  ముఖ్యంగా టైర్-1,  టైర్-2 నగరాల నుంచి మరింత జనం కేబుల్ టీవీ నుండి స్ట్రీమింగ్ ప్లాట్‌‌ఫారమ్‌‌లకు మారవచ్చు. టీవీ వ్యూయర్ల సంఖ్య పెరుగుతున్నందున ప్రస్తుతానికి కేబుల్ టీవీ ఇండస్ట్రీ నష్టం లేదు. ఇక ముందు కూడా ఏవీఓడీ లేదా అడ్వర్టైజింగ్ లీడ్ ప్లాట్‌‌ఫారమ్‌‌లు ఎస్వీఓడీ కంటే ఎక్కువ ఆదాయాన్ని దక్కించుకుంటాయి. ఇది 2021లో  1.1 బిలియన్ల డాలర్లుకాగా, 2026లో 2.4 బిలియన్ల డాలర్లకు పెరుగుతుంది. ఎస్వీఓడీ మార్కెట్​ ప్రస్తుత 0.8 బిలియన్ల డాలర్ల నుండి 2026లో 2.1 బిలియన్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా.   డెలాయిట్ ఇండియాకు చెందిన జెహిల్ థక్కర్ ఈ విషయమై మాట్లాడుతూ  దేశంలో ఎస్వీఓడీ ప్లాట్‌‌ఫారమ్‌‌లకు ఇప్పటికే చాలా మంది మారినప్పటికీ, నష్టాలు ఉన్నాయని అన్నారు. వీటిని తగ్గించడానికి ఓటీటీ ప్లాట్​ఫారాలు డిస్ట్రిబ్యూషన్ పార్ట్​నర్​షిప్​ లేదా  హైబ్రిడ్ మోడల్స్​ వాడాలని థక్కర్ అన్నారు.