
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'కాంతారా' దేశవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిత్రంగా వచ్చి.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్స్ వర్షం కురిపించింది. కన్నడ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న'కాంతారా: ఏ లెజెండ్ - ఛాప్టర్ 1' ఇప్పుడు మరో సంచలనానికి తెర తీసింది. ఈ చిత్రం ఇంకా థియేటర్లలోకి రాకముందే రికార్డును క్రియేట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో కుదిరిన ఓటీటీ ఒప్పందంతో సినిమా నిర్మాణ బడ్జెట్ విడుదలకు నెల రోజుల ముందే తిరిగి వచ్చేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
కేవలం మూడు పోస్టర్లతోనే అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చింది ''కాంతారా:- ఛాప్టర్ 1' . ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా కన్నడ పరిశ్రమలో 'కేజీఎఫ్ 2' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఏకంగా రూ.125 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇది 'కాంతారా'కు ఉన్న క్రేజ్‌కి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
'కాంతారా: ఛాప్టర్ 1' సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నారు మూవీ మేకర్స్. దాదాపు 20కి పైగా ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా తీర్చిదిద్దుతున్నామని ఇప్పటికే ప్రకటించారు . పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు.
►ALSO READ | OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్స్.. ఈ వీకెండ్ టాప్ మూవీస్, వెబ్ సిరీస్లివే
ఈ మూవీలో రిషబ్ శెట్టితో పాటు జయరామ్, రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మరో ఆకర్షణ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పంజాబీ గాయకుడు దిల్‌జిత్ దోసాంజ్ పాడిన పాట కూడా ఉంది. ఇక కథ విషయానికి వస్తే ఈ 'కాంతారా:- ఛాప్టర్ 1' కదంబా సామ్రాజ్యం కాలంలో శివుడి బాల్యం, అతని పూర్వీకుల పోరాటాలు, అడవుల చుట్టూ అల్లుకున్న పురాణ కథనాలను అన్వేషిస్తుంది. 'హోంబలే ఫిల్మ్స్' నిర్మాణ సంస్థ.. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది. 'కాంతారా' ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా మిథికల్ థీమ్, పూర్వీకుల కథతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.