
జీవితాంతం కలిసి ఉందామనుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలిచిందన్నట్లుగా పెళ్లి జరిగిన కొన్ని రోజులకే వారి దాంపత్య జీవితంలో విభేదాలు స్టార్ట్ అయ్యాయి. కుటుంబ కలహాలు, కట్నానికి సంబంధించిన గొడవలు చెలరేగాయి. విభేదాలు మరింత ముదరడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. పోలీస్ స్టేషన్లో కూడా పంచాయతీ తేలకపోవడంతో ఇష్యూ కోర్టుకు చేరింది.
ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుండటంతో గత కొంత కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు, కేసులు అంటూ తిరగలేకపోయారో లేక కుటుంబ కలహాలు పక్కను పెట్టి మళ్లీ కలిసి ఉండాలనుకున్నారేమో తెలియదు కానీ లోక్ అదాలత్ సాక్షిగా మళ్లీ ఒక్కటయ్యారు భార్యాభర్తలు. స్వయంగా జడ్జి సమక్షంలో పూల దండలు మార్చుకుని మళ్లీ కలిసిపోయారు. ఈ ఆసక్తికర పరిణామానికి జగిత్యాల జిల్లా కోర్టు వేదికైంది.
వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన వెంకటేష్, హారిత.. జగిత్యాల పట్టణానికి చెందిన ముస్తఫా, షిరిన్ సుల్తానా భార్యాభర్తలు. కట్నం విషయంలో విభేదాలు రావడంతో చాలా సంవత్సరాలుగా ఈ రెండు జంటలు వేర్వేరుగా ఉంటున్నారు. వీళ్ల పంచాయతీ ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. వరకట్నం, మెయింటెనెన్స్ కేసుల తిప్పలు ఎదుర్కొంటూ గత కొంత కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.
సడెన్గా ఏమైందో తెలియదు కానీ వెంకటేష్, హారిత.. ముస్తఫా, షిరిన్ సుల్తానా దంపతులు మనసు మార్చుకున్నారు. కుటుంబ కలహాలను పక్కనపెట్టి మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు శనివారం (సెప్టెంబర్ 13) జగిత్యాల జిల్లా కోర్టులో జరిగిన లోక్ అదాలత్లో కేసుల రాజీకి ముందుకొచ్చారు. గతంలో పెట్టుకున్న కేసులను విత్ డ్రా చేసుకుని మళ్లీ ఒక్కటి కావాలని డిసైడ్ అయ్యారు.
ఇందులో భాగంగా జిల్లా జడ్జి, ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సమక్షంలో రెండు జంటలు రాజీ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత వెంకటేష్ – హారిత, ముస్తఫా – షిరిన్ సుల్తానా దంపతులు ఒకరికి ఒకరు పూలదండలు మార్చుకుని మళ్లీ ఒక్కటయ్యారు. విభేదాలను పక్కకు పెట్టి మళ్లీ ఒక్కటైన రెండు జంటలను ఈ సందర్భంగా జడ్జి అభినందించారు. కలహాలు ఎంత పెద్దవైనా రాజీ కుదుర్చుకుని ముందుకు సాగాలని సూచించారు.