సీజేఐ జస్టిస్​ రమణకు గౌరవ డాక్టరేట్ 

సీజేఐ జస్టిస్​ రమణకు గౌరవ డాక్టరేట్ 
  • 31 మందికి గోల్డ్ మెడల్స్
  • 260 మందికి పీహెచ్‌‌డీ పట్టాలు

సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ 82వ కాన్వొకేషన్ శుక్రవారం క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. గవర్నర్ తమిళిసై, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. స్నాతకోత్సవ వివరాలను ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఈసారి 31 మందికి గోల్డ్​మెడల్స్, 260 మందికి పీహెచ్​డీ పట్టాలు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. సాయంత్రం 6 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమవుతుందని, విద్యార్థులు అరగంట ముందే రావాలని సూచించారు. విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీ వైట్ డ్రెస్ లో రావాలన్నారు. పాస్​కలిగిన విద్యార్థితో ఒకరిని అనుమతిస్తామని, పాస్ లేనోళ్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశామని, పాస్ ఉన్న వెహికల్స్ నే క్యాంపస్ లోకి అనుమతిస్తామని చెప్పారు. కాగా, గోల్డ్​మెడల్స్ అందుకోనున్న 31 మందిలో 27 మంది, పీహెచ్ డీ పట్టాలు అందుకోనున్న 260 మందిలో 146 మంది అమ్మాయిలు ఉన్నారు. 

21 ఏండ్ల తర్వాత గౌరవ డాక్టరేట్.. 
ఓయూలో 1917 నుంచి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారు. 1917 నుంచి 2001 వరకు 47 మందికి గౌరవ డాక్టరేట్లు అందజేశారు. అయితే ఆ తర్వాత నుంచి ఇవ్వడం లేదు. ఇప్పుడు 82వ కాన్వొకేషన్ లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ అందజేయనున్నారు. 

క్యాంపస్ లో 300 మంది పోలీసులు
కాన్వొకేషన్ సందర్భంగా క్యాంపస్ లో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓయూలో ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. గవర్నర్ తమిళిసై, సీజేఐ రమణ రానుండడంతో సమస్యలను వాళ్ల దృష్టికి తీసుకెళ్లాలని విద్యార్థులు సమాయత్తమవుతున్న తరుణంలో పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దింపారు. ఓయూ పరిసరాల్లోని 7 స్టేషన్ల నుంచి 300 మంది పోలీసులు క్యాంపస్​లో పహారా కాస్తున్నారు. వీరికి తోడు స్పెషల్ పోలీసులనూ రంగంలోకి దింపారు.