ఓయూతో ఐసీఏఐ అవగాహన ఒప్పందం

ఓయూతో ఐసీఏఐ అవగాహన ఒప్పందం

ఓయూ, వెలుగు : ప్రపంచవ్యాప్త ప్రమాణాలకు అనుగుణంగా వాణిజ్య, అకౌంటింగ్ విభాగాల్లో పాఠ్య ప్రణాళికలు, కోర్సులను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)అగ్రిమెంట్ కుదుర్చుకుంది. సోమవారం ఆయా విద్యాసంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. ఓయూతో  న్యూ ఢిల్లీకి చెందిన ఐసీఏఐ కలిసి పనిచేసేందుకు నిర్ణయించడంపై ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ​పి. లక్ష్మి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. 

యూజీ, పీజీ డిగ్రీల్లో వాణిజ్య విద్యను మెరుగుపరించేందుకు, అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  హైదరాబాద్​లోనే 12,000 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు పని చేస్తున్నారని, వీరిలో 90 శాతం మంది  ఓయూలో చదివినవారేనని న్యూ ఢిల్లీకి చెందిన ఐసీఏఐ సంస్థ ప్రతినిధి ముప్పాల శ్రీధర్ చెప్పారు. యూజీసీ రూల్స్ మేరకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ ద్వారా వాస్తవిక  నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఐసీఏఐకి చెందిన శర్మ, వందనా నాగ్ పాల్​, శ్రీధర్,​ఎన్ఎన్​సేన్​ గుప్తా, సీఏ దయానివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.