పేపర్ల లీకేజీని నిరసిస్తు దీక్ష చేపట్టిన ఓయూ విద్యార్థులు

పేపర్ల లీకేజీని నిరసిస్తు దీక్ష చేపట్టిన ఓయూ విద్యార్థులు

TSPSC పేపర్ల లీకేజీని నిరసిస్తు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల అందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 29వ తేదీన బుధవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ABVP ఆధ్వర్యంలో విద్యార్థులు నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో  విద్యార్థులు పాల్గొన్నారు. TSPSC చైర్మన్ ను వెంటనే రాజీనామా చేయాలని ABVP విద్యార్థుల డిమాండ్ చేశారు. పేపర్ల లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో లేదా CBI తో విచారణ జరుపాలని తెలిపారు. దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలను, అధికారులను అరెస్ట్ చేయాలన్నారు. గతంలో జరిగిన పరీక్షలను రద్దు చేసి తిరిగి అన్నిటినీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. TSPSC ని ప్రక్షాళన చేయాలని చెప్పారు. విద్యార్థుల దీక్ష నేపథ్యంలో ఆర్ట్స్ కాలేజీ ముందు భారీగా పోలీసులు మోహరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి ఉద్యమకారులపై అణచివేత ధోరణిని అవలంబిస్తోందని మరోవై వరంగల్ కేయు జేఏసీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ, విద్యార్థి, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమకారుల సంఘర్షణ సభ నిర్వహించేందుకు నిర్ణయించామని..కానీ అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అయినా తాము న్యాయ పోరాటం చేసి సభ నిర్వహిస్తామని చెబుతున్నారు కేయు జేఏసీ నేతలు. 

Tspsc పేపర్ లీకేజీకి నిరసనగా కుత్బుల్లాపూర్ లోని ఐడీపీఎల్ చౌరస్తాలో ఏబీవీపీ కార్యకర్తల  దీక్ష చేపట్టారు. పేపర్ లీకేజీ కుంభకోణం వెనుక ఉన్న అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం ఎన్ని పరీక్షల పేపర్లు లీకేజీ చేశారో ఆయా పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలను నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ నేతలు వెల్లడించారు. సిట్టింగ్ జడ్జిచే లేదా సిబిఐతో విచారణ జరిపించాలని నిరసన తెలిపారు. ప్రశ్న పత్రాలు లీకేజీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నేతలు.