ఒక్క నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించబోం

ఒక్క నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించబోం

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనున్న పీహెచ్‭డీ ప్రవేశ పరీక్షకు ఒక్క నిమిషం నిబంధన అమలు చేయనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్​రవీందర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ​ఐదేళ్ల తరువాత వర్సిటీ,  పీహెచ్‭డీ ఎంట్రెన్స్ నిర్వహిస్తోందని తెలిపారు. డిసెంబర్1నుంచి 3 వరకు జరుగనున్న పరీక్షలు..రోజుకు 3 దఫాలుగా నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షకు 47 సబ్జెక్టుల్లో 9,776 మంది హాజరు కానున్నట్లు వివరించారు. 

సెంటర్​కు గంట ముందే చేరుకోవాలని ఒక్క నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు.  అత్యధికంగా కామర్స్​ ఫ్యాకల్టీలో 841 మంది దరఖాస్తు చేసుకోగా.. పర్షియన్ ​సబ్జెక్టులో నలుగురు మాత్రమే పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. ఓయూ వెబ్ సైట్ ద్వారా శనివారం నుంచి హాల్ టికెట్లను డౌన్​లోడ్​చేసుకోవచ్చన్నారు. ఇటీవల వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపైనా వీసీ స్పందించారు. కొంతమంది విద్యార్థులు కావాలనే గొడవలకు దిగుతూ, వర్సిటీ అధికారులపై దాడులు చేస్తున్నారని, ఇలాంటి వాటిని సహించేది లేదని అన్నారు.  యూజిసీ నిబంధనల ప్రకారమే కొత్త క్రెడిట్స్ ​నిర్ణయించినట్లు చెప్పారు.