
హుస్నాబాద్, (అక్కన్నపేట): పగలు చెత్త ఏరుతూ, రాత్రిళ్లు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్ తెలిపారు. గత నెలలో చౌటపల్లి పెద్దమ్మ ఆలయంలో చోరీ జరగగా, కేసు నమోదైంది. ఈక్రమంలో సిద్దిపేట సీసీఎస్ సిబ్బందితో కలిసి జనగామ ఎక్స్‌రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా, ఇద్దరు నిందితులు ఆటోలో పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకుని విచారించారు.
భార్యలతో కలిసి అక్కన్నపేట, వర్ధన్నపేట, ఖానాపూర్ ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. మామిడి గోపి, జాదవ్ గణేశ్, నాగమణి, జాదవ్ శిరీషను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వీరు ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో జరిగిన 25 చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పారు.