దేశ ప్రధానికి లేని జీతం మన సీఎంకు ఉంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

దేశ ప్రధానికి లేని జీతం మన సీఎంకు ఉంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ  మెయిన్ లైబ్రరీ హల్ లో టీఎస్ జేఏసీ, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ - తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల భవిష్యత్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి హాజరయ్యారు.

టీఎస్పీఎస్సీ కేసులో సీఎం కేసీఅర్ కు అసలైన నిందితులెవరో తెలుసు అందుకే మాట్లాడడం లేదని బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రధాన నిందతుడిగా ఉండాల్సిన వ్యక్తి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ప్రెస్ మీట్ పెడతాడని సెటైరికల్ కామెంట్ చేశారు. ప్రెస్ మీట్ లో ఇంటి దొంగల పని అని చెప్పి చేతులు దులుపుకునే పని చేశారని, ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చాయని చెప్పి...సెట్ నెంబర్ తప్పు వేసి డిస్ క్వాలిఫై అయినాడని చైర్మన్ చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు. గ్రూప్ 1 లో103 మార్కులు వచ్చిన వ్యక్తి సెట్ నెంబర్ ఎందుకు తప్పు వేస్తాడు.. అంటూ మండిపడ్డారు. 

రాజకీయాల కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నారని కొంత మంది అధికార పార్టీ నాయకులు దృషప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. దేశ ప్రధానికి లేని జీతం మన ముఖ్యమంత్రి తీసుకుంటున్నారని, ప్రధాని రూ.3 లక్షల జీతం తీసుకుంటే.. సీఎం కేసీఆర్ రూ.4లక్షల25 వేలు తీసుకుంటున్నాడని విమర్శించారు. ప్రజలు కట్టే టాక్స్ తో జీతం తీసుకుంటున్న సీఎం కేసీఆర్.. ప్రజలు, నిరుద్యోగుల కోసం ఎందుకు బయటికి వచ్చి మాట్లాడడం లేదని నిలదీశారు.

సీఎం కేసీఅర్ కుమారుడు ట్విట్టర్ పిట్ట పచ్చి అబద్ధాలు ఆడుతూ, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ చైర్మన్ ను కాపాడేందుకు సిట్ పని చేస్తోందన్న ఆయన..అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితుల ఓఎంఆర్ షీట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో జరిగింది చిన్న స్కామ్ కాదని, గతంలో బోర్డు ఛైర్మన్ గా ఉన్న ఘంటా చక్రపాణి ఏం అనుకున్న పర్వాలేదు గానీ.. గతంలో జరిగిన పరీక్షలు కూడా లీకైనట్లు తెలుస్తోందని ఆరోపించారు. సిట్ ఇప్పటికీ గ్రూప్ 1 పై విచారణ జరపడం లేదన్న ప్రవీణ్ కుమార్.. ప్రభుత్వ పెద్దల హస్తం లేకుంటే సీబీఐకి కేసు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటీ అని నిలదీశారు.

అసలైన దొంగలను విడిచి పెట్టి, వేరే వారిని విచారణ చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు. అసలు దొంగలు పంజాగుట్టలో ఉన్నారని, సీబీఐకి కేసు అప్పగించేత వరకు నిరుద్యోగులు, విద్యార్థులు పోరాడండి అంటూ పిలుపునిచ్చారు. సిట్ ద్వారా నిరుద్యోగులకు న్యాయం జరగదన్న ఆయన.. ప్రస్తుతమున్న టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేయకుండా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పారు. ఒక వేళ నిర్వహించినా.. తిరిగి మళ్లీ నిరుద్యోగులు మోసపోతారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు ఐదో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.

సీబీఐతో విచారణ జరపాలె

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీక్ కావడం భాదాకరమని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పోయిన నిరుద్యోగులకు ఒక్కొక్కరికీ చొప్పున రూ. 50 వేలు ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ కాకుండా ఉండాలంటే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పారు. పేపర్ల లీక్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. బీఅర్ఎస్ పార్టీ నాయకుల బంధువులే అనేక మంది టీఎస్పీఎస్సీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పేపర్ల లీకులపై వెంటనే సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరపాలని ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.