మన ఎకానమీ 4 ట్రిలియన్ డాలర్లకు.. సీఈఓ అనంత నాగేశ్వరన్

మన ఎకానమీ 4 ట్రిలియన్ డాలర్లకు.. సీఈఓ అనంత నాగేశ్వరన్

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ విలువ నాలుగు ట్రిలియన్ డాలర్లను దాటుతుందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత్ నాగేశ్వరన్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం 3.9 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 

ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన 'ఐవీసీఏ గ్రీన్ రిటర్న్స్ సమ్మిట్​ 2025'లో ఆయన మాట్లాడుతూ, మార్చి 2025 చివరి నాటికి ఉన్న 3.9 ట్రిలియన్ డాలర్ల నుంచి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటుతుందని చెప్పారు. భౌగోళిక రాజకీయాలు (జియోపాలిటిక్స్​) అనిశ్చితంగా ఉన్న ఈ సమయంలో, ప్రపంచంలో భారతదేశం సత్తా చాటాలంటే ఆర్థిక వృద్ధి చాలా ముఖ్యమన్నారు.  

గ్లోబల్ వార్మింగ్​అనర్థాల గురించి తెలుసు కాబట్టే, 2070 నాటికి నికర సున్నా (నెట్​ జీరో) లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం కట్టుబడి ఉందని నాగేశ్వరన్​ చెప్పారు. ఇదిలా ఉంటే,  ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్​-రా) భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతానికి పెంచింది. 

జూన్ క్వార్టర్​లో నమోదైన భారీ వృద్ధి, అమెరికా టారిఫ్ పెంపు ప్రపంచ వృద్ధి వాణిజ్యంపై తక్కువ ప్రభావాన్ని చూపుతుందని భావించడం ఈ పెంపునకు కారణం. ఇండ్​-రా తన మునుపటి అంచనా 6.3 శాతం కంటే ఇది 70 బేసిస్ పాయింట్లు ఎక్కువ.  ఆర్​బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధిని 6.8 శాతంగా అంచనా వేసింది.