- పుకార్లను నమ్మొద్దని విజ్ఞప్తి
ముంబై: మహారాష్ట్ర గవర్నమెంట్ ఎప్పటికే స్ట్రాంగ్ అని, ఎన్సీపి, శివసేన మధ్య ఎలాంటి గొడవలు లేవని శివసేన పార్టీ చెప్పింది. ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, సీఎం ఉద్ధవ్‌థాక్రే సోమవారం భేటీ కాగా.. కరోనా కట్టడి, లాక్‌డౌన్ విధించడం, దాన్ని ఎత్తేసే అంశంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని, అందుకే సమావేశామయ్యారని పుకార్లు షికారు చేయడంతో శివసేన క్లారిటీ ఇచ్చింది. తమ ప్రభుత్వంలో ఎలాంటి గొడవలు లేవని, స్ట్రాంగ్‌గా ఉందని శివసేన సీనియర్ లీడర్, ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. “ మాతోశ్రీలో శరద్‌పవార్, సీఎం ఉద్ధవ్ థాక్రే ఇద్దరు భేటీ అయ్యారు. వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇద్దరు దాదాపు గంటన్నర పాటు మాట్లాడుకున్నారు. కొంత మంది కడుపుమంటతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. భయపడాల్సిన పనిలేదు. జై మహారాష్ట్ర” అని రౌత్ ట్వీట్ చేశారు. శరద్‌పవార్ సోమవారం ఉదయం గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఉద్ధవ్ థాక్రేతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై చాలా పుకార్లు వచ్చాయి. కాగా.. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని ఎన్సీపి వర్గాలు చెప్పాయి.
