కేసీఆర్​ను గద్దె దింపితేనే మన బతుకులు బాగయితై

కేసీఆర్​ను గద్దె దింపితేనే మన బతుకులు బాగయితై
  • అక్కడ రాజపక్స ఫ్యామిలీ.. ఇక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీ
  • రాష్ట్రంలో బీజేపీ 65-70 సీట్లు గెలుస్తది
  • కామారెడ్డి జిల్లాలో బీజేపీ భరోసా యాత్ర

కామారెడ్డి , వెలుగు : రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ పూర్తిగా ఖాళీ చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసి, శ్రీలంకలా మారుస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి అన్నారు. శ్రీలంకలో రాజపక్స ఫ్యామిలీ వల్ల ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇక్కడ కేసీఆర్ ​ఫ్యామిలీ వల్ల కూడా అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.  కేసీఆర్​ను  గద్దె దింపితేనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుందని, ప్రజలు తమ ఓటుతో  కేసీఆర్​ను గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని వస్తువుల ధరలు పెంచారని, ధరల పెంపులో  మన రాష్ర్టం నంబర్​ వన్ లో ఉందని పేర్కొన్నారు. స్టేట్​లో బీజేపీ  అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘పల్లె గోస –- బీజేపీ భరోసా’ ప్రోగ్రాంలో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్​ నియోజకవర్గంలో  చివరి రోజైన 11వ రోజు ఆదివారం మద్నూర్​ మండల కేంద్రంలో వివేక్​ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దళితవాడకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు, పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి  ఎనిమిదేండ్లు కావస్తున్నా ప్రజలు ఇంకా గోసపడుతూనే ఉన్నారని అన్నారు. ‘‘రూ.5 లక్షల కోట్ల అప్పు చేసినా ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు. తన ఫ్యామిలీ ఆస్తులు పెంచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్​ పనిచేస్తున్నడు. కమీషన్ల కోసమే రూ.లక్ష కోట్లతో  కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఇంజనీర్​ కాకుండా ప్రాజెక్టు డిజైన్​ను  కేసీఆర్ ఎట్లా చేస్తడు? మంథనిలో కోల్​మైనింగ్​లో రూ.20 వేల కోట్ల కుంభకోణం జరిగింది. అన్ని పనుల్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ కేసీఆర్​అవినీతికి పాల్పడుతున్నడు. ప్రజలపై రూ.5 లక్షల కోట్ల అప్పుల భారం మోపిండు. కరెంటు చార్జీలు, బస్సు చార్జీల పెంపులో మన స్టేట్​దేశంలోనే నంబర్​వన్​లో ఉంది. ఇటీవల నిర్వహించిన సర్వేలో దేశంలోని అవినీతిలో మన సీఎం నంబర్​వన్ స్థానంలో ఉన్నట్లు తేలింది” అని వివేక్​ వ్యాఖ్యానించారు.  

ట్రిపుల్​ ఐటీ స్టూడెంట్లపై కక్ష సాధింపు మానుకోవాలి

ట్రిపుల్​ఐటీ స్టూడెంట్స్​పై రాష్ర్ట ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వివేక్​కోరారు. సీఎం ఆదేశాలతోనే స్టూడెంట్స్​ను అధికారులు హింసిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా పల్లెగోస ప్రోగ్రాంలో పార్టీ జిల్లా ప్రెసిడెంట్​అరుణతార, జడ్పీ మాజీ చైర్మన్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి , పార్టీ మండల శాఖ ప్రెసిడెంట్​హన్మండ్లు, జిల్లా జనరల్ సెక్రటరీ రాము తదితరులు పాల్గొన్నారు.

అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్నడు

ప్రజలు ఓటుతోనే  సీఎం కేసీఆర్​కు బుద్ధి చెప్పాలని వివేక్​పిలుపునిచ్చారు. ఎన్నికలు రాగానే  సీఎం ఏవో స్కీమ్​లు ప్రకటిస్తున్నారని, అవినీతితో సంపాదించిన సొమ్ము పంచి గెలవాలని చూస్తున్నారని ఆయన ఫైర్​అయ్యారు. మాయమాటలు చెప్పి ప్రజలను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు  ఓటు వేసే ముందు బాగా ఆలోచించుకోవాలని సూచించారు. ఇక స్టేట్​లో బీజేపీ 65 నుంచి 70 సీట్లు గెలుస్తుందని చెప్పారు. ప్రజలు కేసీఆర్ పాలనతో విసుగెత్తి పోయారని అన్నారు. అవినీతిలేని పాలన బీజేపీతోనే సాధ్యమని భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలకు మంచి పాలన అందుతున్నదని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి కేంద్రం ఏటా 2 లక్షల ఇండ్లు సాంక్షన్​ చేసిందని, కానీ వాటికి సంబంధించిన నిధులను కేసీఆర్​దారి మళ్లించి, ప్రజలకు డబుల్ బెడ్​ రూం ఇండ్లు నిర్మించలేదని విమర్శించారు.