రాష్ట్ర సర్కార్ కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: 2008 డీఎస్సీ మెరిట్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. ఆ నోటిఫికేషన్లోని 3,500 పోస్టులను ఇప్పటిదాకా భర్తీ చేయలేదని.. వీటిలో తెలంగాణకు 1,815 పోస్టులున్నాయని చెప్పింది. ఈ మేరకు రెండ్రోజుల కింద జస్టిస్ అభినంద్ కుమార్ షావిలీ, జస్టిస్ శరత్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. 2008 డిసెంబర్ 6న ఉమ్మడి ఏపీలో 52,655 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటి ఫికేషన్ ఇచ్చారు.
అయితే ఇందులో 30శాతం పోస్టులను డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 1న జీవో 28 జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ బీఈడీ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ‘‘మొత్తం పోస్టుల్లో ఇప్పటి దాకా 3,500 పోస్టులను భర్తీ చేయలేదు. ఏపీ వాటా పోస్టులను కాంట్రాక్ట్ విధానం కింద భర్తీ చేశారు. తెలంగాణకు చెందిన 1,815 పోస్టులను భర్తీ చేయలేదు. వీటిని ఆనాడు మెరిట్ సాధించిన అభ్యర్థులతో భర్తీ చేయాలి” అని ఆదేశించింది.
