
- అనుమతుల్లేకుండానే అదనపు మెషీన్లతో ఉత్పత్తి
- కేకే–5 గనిలో సైడ్ఫాల్తో కార్మికుడి మృతిపై తోటి కార్మికుల ఆందోళన
- ఎస్డీఎల్ మెషీన్మొరాయించడంతోనే ప్రమాదమని ఆరోపణ
- కొత్తవి తేవాలని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలు
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ మైన్స్ లో కాలం చెల్లిన ఎస్ డీఎల్ మెషీన్లతో కార్మికుల ప్రాణాలు పోతున్నాయి. బొగ్గు ఉత్పత్తిలో సైడ్ డిశ్చార్జి లోడర్(ఎస్డీఎల్),లో హైట్ డిశ్చార్జి లోడర్(ఎల్‌హెచ్‌టీ),కంటిన్యూస్ మైనర్, లాంగ్వాల్ మెషీన్లే కీలకమైనవి. పది మంది కార్మికులు మూడు షిప్టుల్లో చేసే పనిని ఒక ఎస్డీఎల్ మెషీన్ ఒకే షిప్టులో చేస్తోంది. దీంతో సింగరేణిలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుండగా.. వీటిలో అధికంగా కాలం చెల్లినవే ఉన్నాయి. ఇవి తరచూ బ్రేక్డౌన్అవుతుండడంతో ఆపరేటింగ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాత మెషీన్ల వాడకంతో బొగ్గు ఉత్పత్తి తగ్గడంతో పాటు కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈనెల 1న మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కళ్యాణ ఖని –-5 గనిలో ఎస్డీఎల్మెషీన్ మొరాయించడంతో బొగ్గు సైడ్ఫాల్ యాక్టింక్ ఎస్డీఎల్ ఆపరేటర్ రాసమల్ల శ్రావణ్ కుమార్ మృతి చెందాడు. అంతకుముందు రామగుండం ఏరియా జీడీకే–11 గనిలో ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ చనిపోయాడు. ఇలా సింగరేణిలో నిత్యం మెషీన్ల బ్రేక్ డౌన్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పాత మెషీన్ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయకుండా యాజమాన్యం ఏండ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రిపేర్లతోనే నడిపిస్తోంది.
గడువు తీరిన మెషీన్లతోనే ప్రమాదాలు
బొగ్గు గనుల్లోని మెషీన్లలో చాలా వరకు సర్వే ఆఫ్(జీవితకాలం పూర్తయినవి) ఉన్నాయి. వీటిని అండర్‌గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ మైన్లలో వినియోగిస్తున్నారు. ఇవి తక్కువ సమయంలో ఎక్కువ బొగ్గును వెలికితీస్తాయి. దీంతో సింగరేణిలో 22 అండర్ గ్రౌండ్మైన్స్లో 16 గనుల్లో సగటున 6 నుంచి 8 పైగా ఎస్డీఎల్ మెషీన్లు పని చేస్తుండగా.. 50 శాతం బొగ్గు ఉత్పత్తి వీటి ద్వారానే వస్తుంది. రూ.35లక్షల విలువైన ఎస్డీఎల్మెషీన్ జీవితకాలం నాలుగేండ్లు(12వేల గంటలు). కాగా.. 1.2లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తాయి. మెషీన్లు 8 – 12ఏండ్ల కాలం నాటివి. వీటిని పక్కన పెట్టాల్సి ఉన్నప్పటికీ కొత్తవి కొనడంలో సింగరేణి నిర్లక్ష్యం చేస్తోంది.
2012 – 2023 వరకు కొత్త ఎస్డీఎల్మెషీన్లను కొనలేదు. పాతవి తరచూ బ్రేక్‌డౌన్(మొరాయించడం) అవుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికుడు శ్రావణకుమార్ మృతిచెందడానికి కారణమైన ఎస్డీఎల్మెషీన్ 12 ఏండ్లదని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. గనిలో రూల్స్ కు విరుద్ధంగా అదనపు మెషీన్లను వినియోగిస్తున్నారని, వీటిలో అత్యధికంగా కాలం చెల్లినవే ఉండగా.. వాటితోనే ఆఫీసర్లు బొగ్గు ఉత్పత్తి చేయాలం టూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్ని ఆందోళనలు చేసిన యాజమాన్యం పట్టించుకోవడంలేదని పేర్కొంటున్నారు.
రిపేర్లతోనే సరిపెడుతున్న ఆఫీసర్లు
పాత ఎస్డీఎల్ స్పేర్స్సమకూర్చడంలోనూ నిర్లక్ష్యమే ఉంటుంది. ప్రధానంగా మెషీన్ల హైడ్లర్వీల్స్, రోలర్లు, ట్రాక్ చైన్స్కొరత తీవ్రంగా ఉంది. అయినా అరిగిపోయిన వాటితోనే పనులు చేయిస్తున్నారు. రికాల్ స్ర్పింగ్స్ సప్లై కూడా లేదు. హోస్పైప్స్తరచూ పగిలిపోతున్నాయి. సర్వేడ్ఆఫ్ డంపర్ల టైర్లు రన్నింగ్ లోనే ఊడిపోయే ప్రమాదం పొంచి ఉంది. బ్రేక్‌లు సరిగా పడట్లేదు. తరచూ బ్రేక్‌డౌన్ అవుతున్నాయి. కాలుతున్న బొగ్గును ఎత్తే క్రమంలో ప్రమాదవశాత్తు ఫైర్వస్తే కట్టడి చేసేందుకు సెన్సార్లు పని చేయడంలేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిపేర్ చేసేందుకు రోజంతా పడుడడంతో బొగ్గు ఉత్పత్తికి నష్టం కలుగుతుందని పేర్కొంటున్నారు. ఎస్డీఎల్మెషీన్లలో నాసిరంగకంగా హైడ్రాలిక్ ఆయిల్ వాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఒక ఎస్డీఎల్ మెషీన్ పై 10 మంది కార్మికులు పని చేస్తుంటారు. ఆపరేటర్లకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బొగ్గు లోడింగ్టబ్ లకు దూరం ఎక్కువగా ఉండటంతో పని ఒత్తిడి పెరుగుతుంది. వీటిని నడిపేటప్పుడు, దారి ఎత్తు, పల్లాలుగా ఉండటం,చాలా సేపు కూర్చోనే పనిచేయాల్సి ఉంటుంది. నడుం నొప్పులు, మెడ నరాలు, చేతులు గుంజడం వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఏటా వేల కోట్ల టర్నోవర్ తో అదే స్థాయిలో లాభాలు గడిస్తున్న సింగరేణిలో కొత్త మెషీన్ల కొనుగోలుపై నిర్లక్ష్యం చేస్తోంది. ఎస్డీఎల్మెషీన్లను ప్రైవేటుకు అప్పగించేందుకే యాజమాన్యం పదేండ్లుగా కొత్తవి కొనలేదని కార్మికులు, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కొత్త మెషీన్లను అందుబాటులోకి తేవాలి
మందమర్రి ఏరియా కేకే-– 5 బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు శ్రావణ్ కుమార్మృతి ఘటనకు సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. పాత ఎస్డీఎల్ మెషీన్ల వాడకంతోనే ప్రమాదాలు జరుగుతున్నా రక్షణ చర్యలపై సంస్థ నిర్లక్ష్యం ఉంది. ఘటనకు ఏరియా జీఎం, సంబంధిత ఆఫీసర్లు బాధ్యత వహించాలి. సింగరేణిలో గడువు తీరిన మెషీన్లను పక్కనపెట్టాలి. కార్మికుల రక్షణకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పాత మెషీన్లను గుర్తించి కొత్తవి తేవాలని సింగరేణి సీఎండీని, యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నా. - జి. వివేక్ వెంకటస్వామి, కార్మిక, గనుల శాఖ మంత్రి
పాత మెషీన్లతోనే పని చేయమని అధికారుల ఒత్తిళ్లు
అండర్ గ్రౌండ్ మైన్లలో ఎస్డీఎల్ మెషీన్లపై పనిగంటలు పెంచాలంటూ కార్మికులపై ఆఫీసర్లు ఒత్తిడి చేస్తున్నారు. మెషీన్ల బ్రేక్ డౌన్లతో కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తద్వారా బొగ్గు ఉత్పత్తికి కూడా నష్టం జరుగుతుంది. 13ఏండ్లలో ఒక్క కొత్త ఎస్డీఎల్ మెషీన్కూడా కొనలేదు. మేము గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత 48 మెషీన్లను కొనుగోలు చేయించాం. సింగరేణిలో యూజీ, ఓసీపీల్లో ఇంకా గడువుతీరిన మెషీన్లు భారీగానే ఉన్నాయి. -వాసిరెడ్డి సీతారామయ్య,స్టేట్ ప్రెసిడెంట్,సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ