
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మహారాజా యశ్వంతరావు ఆసుపత్రిలో ఎలుక కాటుకు గురై ఇద్దరు నవజాత శిశువులు మరణించిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ చనిపోలేదని వాళ్లది పూర్తిగా ప్రభుత్వ హత్య అని కేంద్ర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ఈ సంఘటన చాలా భయంకరమైనదని.. దాని గురించే వింటేనే వింటేనే వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక తల్లి తన బిడ్డను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఎప్పటిలాగే చెబుతుంది. కానీ ఆసుపత్రిలో శిశువుల భద్రతను కూడా సరిగ్గా నిర్వహించలేనప్పుడు ప్రభుత్వాన్ని నడపడానికి మీకు ఏ హక్కు ఉంది..? ఈ ఘటనతో ప్రధాని మోడీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సిగ్గుతో తలలు దించుకోవాలని ఘాటు విమర్శలు చేశారు.
ఆరోగ్య రంగాన్ని ప్రైవేటీకరణ చేయడంతో ధనవంతులకు మెరుగైన చికిత్స అందుతోందని.. పేదల కోసం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు ఏ మాత్రం సురక్షితంగా లేవని.. అవి మృత్యు కూపాలుగా మారాయని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన లక్షలాది మంది తల్లిదండ్రుల తరపున మేం గొంతు వినిపిస్తున్నాం.. దీనిపై మీ స్పందన ఏంటని మోడీని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఇకపై మేం మౌనంగా ఉండమని.. ఈ పోరాటం ప్రతి పేద వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ హక్కుల కోసమన్నారు.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరావు ఆసుపత్రిలో 2025, ఆగస్టు 30-31 మధ్య రాత్రి ఇద్దరూ నవజాత శిశువులను ఎలుకలు కరిచాయి. ఒకరి చేతికి, మరొకరి భుజానికి గాయమైంది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న శిశువులు ఎలుక కాటుతో మరింత అనారోగ్యానికి గురై మరణించారు. ఐసీయూలో ఎలుక కాటుతో ఇద్దరూ నవజాత శిశువులు మరణించడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్.. పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.