ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను తీసేస్తున్నరు 

ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను తీసేస్తున్నరు 
  • ఇప్పటికే నిజామాబాద్ లో 70, కొత్తగూడెంలో 48, ఖమ్మంలో 28, నిర్మల్​లో 
  • 10 మంది తొలగింపు.. ఆయా పంచాయతీల్లో రెగ్యులర్ వాళ్లకు పోస్టింగులు 
  • 317 జీవో ఎఫెక్ట్ తో పోతున్న కొలువులు 

హైదరాబాద్, వెలుగు: పలు జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను తీసేస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 70, భద్రాద్రి కొత్తగూడెంలో 48, ఖమ్మంలో 28, నిర్మల్ లో 10 మందిని, ములుగులో నలుగురిని తొలగించారు. ఉద్యోగుల బదిలీల్లో భాగంగా, ఆయా పంచాయతీల్లో రెగ్యులర్ ఉద్యోగులకు పోస్టింగులు ఇస్తున్నారు. రాష్ర్టంలో 12,761 గ్రామ పంచాయతీలు ఉండగా... 3 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 7 వేల మంది దాకా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. దాదాపు 3 వేల మంది ఔట్ సోర్సింగ్ వాళ్లు పని చేస్తున్నారు. ఇప్పుడు బదిలీల్లో భాగంగా రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. జూనియర్ సెక్రటరీలను ఎక్కడోళ్లను అక్కడ్నే ఉంచారు. 317 జీవో వల్ల సీనియర్లకు  ఇష్టానుసారంగా పోస్టింగులు ఇస్తుండడంతో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది.  
అన్ని జిల్లాల్లోనూ తొలగింపులు... 
అధికారులు ఏజెన్సీల ద్వారా ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను నియమించారు. అయితే ఏజెన్సీలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున జీతం చెల్లిస్తుండగా, ఏజెన్సీలు మాత్రం సెక్రటరీలకు రూ.10,900 నుంచి రూ.12,500 మాత్రమే చెల్లిస్తున్నాయి. కాగా, ఇప్పుడు అన్ని జిల్లాల్లోని ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎంప్లాయీస్ ను తొలగించినట్లు ఏజెన్సీలకు సమాచారం ఇచ్చారు. ఇన్ని రోజులు తక్కువ జీతానికే 12 గంటలు పని చేశామని, ఇప్పుడు ఉన్నపళంగా తొలగిస్తే ఎలాగని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. డ్యూటీలోకి తీసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. సంక్రాంతి తర్వాత అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేస్తామని ఔట్ సోర్సింగ్ సెక్రటరీలు హెచ్చరిస్తున్నారు.   
మళ్లా భర్తీ ఎట్ల?  
ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను తొలగిస్తే, ఆ పోస్టులను భర్తీ చేయడం ఎలా అని అధికారులు తల పట్టుకుంటున్నారు. జూనియర్లు రాజీనామా చేస్తేనే, సెలెక్ట్ లిస్టులో తర్వాత ఉన్నోళ్లను పిలిస్తేనే ఎవరూ రావడం లేదని.. అలాంటిది ఔట్ సోర్సింగ్ కు ఎవరు వస్తారని అంటున్నారు. పైగా జీతం రూ.15 వేల లోపే ఉండడం, పని ఒత్తిడి, షోకాజ్ నోటీసులు తదితరాలతో కార్యదర్శి పోస్టు అంటేనే భయపడుతున్నారని పేర్కొంటున్నారు. 
కోర్టుకు పోతం..  
ఏడాది నుంచి ఔట్ సోర్సింగ్ సెక్రటరీ గా పని చేస్తున్న. ఇప్పుడు నేను పని చేస్తున్న దగ్గర సీనియర్ కార్యదర్శికి పోస్టింగ్ ఇచ్చారు. అన్ని జిల్లాల్లోనూ ఔట్ సోర్సింగ్ వాళ్లను తీసేస్తున్నరు. దీనిపై కోర్టుకు పోతం. జిల్లాల్లో ధర్నాలు చేస్తం. - సంతోష్ , సంగారెడ్డి