The Hundred 2025: హ్యాట్రిక్ టైటిల్స్ కొట్టారు: హండ్రెడ్ లీగ్ విజేత ఓవల్ ఇన్విన్సిబుల్స్.. ఫైనల్లో రాకెట్స్‌పై విక్టరీ

The Hundred 2025: హ్యాట్రిక్ టైటిల్స్ కొట్టారు: హండ్రెడ్ లీగ్ విజేత ఓవల్ ఇన్విన్సిబుల్స్.. ఫైనల్లో రాకెట్స్‌పై విక్టరీ

హండ్రెడ్ లీగ్ ట్రోఫీ విజేతగా ఓవల్ ఇన్విన్సిబుల్స్ నిలిచింది. ఆదివారం (ఆగస్టు 31) ట్రెంట్ రాకెట్స్ పై జరిగిన ఫైనల్లో 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ అందుకుంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ కు ఇది వరుసగా మూడో హండ్రెడ్ లీగ్ టైటిల్ కావడం విశేషం. 2024, 2023 లోనూ ఓవల్ ఇన్విన్సిబుల్స్ టైటిల్ గెలిచింది. స్టోయినిస్ ను సాకిబ్ మహమూద్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడంతో  ఇన్విన్సిబుల్స్ సంబరాల్లో తేలిపోయారు. టోర్నీ అంతటా అద్భుతంగా రాణించిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఫైనల్లోనూ ఎలాంటి తడబాటు లేకుండా విజయాన్ని అందుకుంది. 

ఈ మెగా ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 168 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ టవాండా ముయేయే 15 పరుగులే చేసి ఔటైనా.. విల్ జాక్స్, జోర్దాన్ కాక్స్ జట్టును ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్ కు 87 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ కు బాటలు వేశారు. జాక్స్ 72 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే.. కాక్స్ 40 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ తప్పిస్తే మిగిలిన వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రాకెట్స్ బౌలర్లలో డిల్లాన్ పెన్నింగ్టన్ 20 బంతుల్లో 23 పరుగులే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. 

ALSO READ : ఆయుష్‌‌‌‌‌‌‌‌ బదోనీ డబుల్‌‌‌‌‌‌‌‌ సెంచరీ

169 పరుగుల లక్ష్య ఛేదనలో ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. 36 పరుగుల జట్టు స్కోర్ వద్ద రూట్, రెహాన్ అహ్మద్ ఔట్ కావడంతో రాకెట్స్ జోరు తగ్గింది. ఆ కాసేపటికే డేవిడ్ విల్లీ (14), బంటన్ (23) ఔట్ కావడంతో రాకెట్స్ కష్టాల్లో పడింది. ఒక ఎండ్ లో మార్కస్ స్టోయినీస్ (68) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా అతనికి సహకరించేవారు కరువయ్యారు. నాథన్ సౌటర్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సౌటర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. జోర్దాన్ కాక్స్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.