హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ కు భారీ రెస్పాన్స్.. ఒక్కరోజే 100 మిలియన్లకు పైగా సెల్ఫీలు

హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ కు భారీ రెస్పాన్స్.. ఒక్కరోజే 100 మిలియన్లకు పైగా సెల్ఫీలు

హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జాతీయ జెండాతో కలిసి సెల్ఫీ దిగి దాన్ని కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయమని ప్రధాని మోదీ ఇటీవల చేసిన ప్రకటనకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫొటోల అప్ లోడ్ కు చివరి తేదీ అయిన ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా సెల్ఫీలు కేంద్ర ప్రభుత్వ హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయ్యాయి.  

'హర్ ఘర్ తిరంగా' ప్రచారం

హర్ ఘర్ తిరంగ వెబ్‌సైట్ హోమ్ పేజీ ప్రకారం, త్రివర్ణ పతాకంతో 10 కోట్ల 8 లక్షల 92 వేల 971 (100 మిలియన్లకు పైగా) సెల్ఫీలు అప్‌లోడ్ అయ్యాయి. కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం, 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల 'హర్ ఘర్ తిరంగ' ప్రచారం - ఆగస్టు 13 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇంటి వద్ద జెండాను ఎగురవేయాలని కోరింది. దాంతో పాటు జాతీయ జెండాతో లేదా డిజిటల్ తిరంగాతో సెల్ఫీని అప్‌లోడ్ చేయడానికి హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్ హోమ్ పేజీలో రెండు ఆప్షన్ లను కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఈ పోర్టల్ లో పలువురు తమ సెల్ఫీలను అప్ లోడ్ చేశారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ను కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గతేడాది జూలై 22న 'హర్ ఘర్ తిరంగ' ప్రచారాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 'హర్ ఘర్ తిరంగా' ప్రచార స్ఫూర్తితో తమ సోషల్ మీడియా ఖాతాల్లోని ప్రొఫైల్  చిత్రాన్ని త్రివర్ణ పతాకానికి మార్చాలని ఆగస్టు 13న ప్రధాని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రజలను కోరారు.

ఈ ప్రచారాన్ని ప్రోత్సహించడానికి, ప్రధాని మోదీ కూడా తన సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ చిత్రాన్ని జాతీయ జెండాగా మార్చారు. వారం మొత్తం ప్లాన్ చేసిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 11న ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలో జరిగిన 'హర్ ఘర్ తిరంగా' బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రచారం రెండవ ఎడిషన్ లో భాగంగా ఈ ర్యాలీని ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇది మథుర రోడ్, భైరాన్ రోడ్, ఇండియా గేట్, ప్రగతి మైదాన్ సొరంగంతో పాటు సాగింది.