
జగదేవపూర్ (వెలుగు) : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో ఓ వ్యవసాయ పొలం వద్ద కోతుల కళేబరాలు కలకలం రేపాయి. ఎవరైనా చంపి ఇక్కడ వేశారా? లేదా కోతులను మరో చోటుకి వాహనంలో తరలిస్తుండగా ఊపిరాడక మృతి చెందాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతులకు దాదాపు 100కు పైగా కోతుల కళేబరాలు కనిపించడంతో సర్పంచ్ కు సమాచారం అందించారు.
ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కోతులను ఎవరో చంపి కళేబరాలను ఇక్కడ వదిలివెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికులు జగదేవపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.