దేశంలో 2.9 ల‌క్ష‌ల మందికి క‌రోనా టెస్టులు.. ఒక్క రోజులో 30 వేలు

దేశంలో 2.9 ల‌క్ష‌ల మందికి క‌రోనా టెస్టులు.. ఒక్క రోజులో 30 వేలు

దేశంలో క‌రోనా టెస్టింగ్ కెపాసిటీ భారీగా పెరిగింద‌ని తెలిపింది భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్). బుధ‌వారం ఒక్క రోజులో దేశ వ్యాప్తంగా 30,043 టెస్టులు చేసిన‌ట్లు తెలిపింది. ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలో ఉన్న 176 వైరాల‌జీ ల్యాబ్స్ లో 26,331 మందికి, 78 ప్రైవేటు ల్యాబ్స్ లో 3,712 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఒక్క షిష్టులో ప‌ని చేస్తేనే రోజుకు 42,400 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గ‌ల‌మ‌ని, అదే రెండు షిఫ్టుల్లో ప‌ని చేస్తే 78,200 టెస్టులు చేయ‌వ‌చ్చని తెలిపింది. దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై రోజువారీ ఆరోగ్య శాఖ ప్రెస్ మీట్ లో ఐసీఎంఆర్ సైంటిస్ట్ డాక్ట‌ర్ ఆర్ గంగాఖేద్క‌ర్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

దేశంలో 3 ల‌క్ష‌ల మందికి టెస్టులు

దేశంలో దాదాపు మూడు ల‌క్ష‌ల టెస్టులు పూర్తి చేసిన‌ట్లు చెప్పింది ఐసీఎంఆర్. ఇప్ప‌టి వ‌ర‌కు 2,90,401 మందికి క‌రోనా టెస్టులు చేసిన‌ట్లు తెలిపారు గంగాఖేద్క‌ర్. దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తిని వేగంగా గుర్తించేందుకు ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు చేయ‌బోతున్న‌ట్లు చెప్పారాయ‌న‌. ఇందుకోసం ఐదు ల‌క్ష‌ల ర్యాపిడ్ కోవిడ్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. అయితే ఈ ర్యాపిడ్ యాంటీ బాడీ డ‌యాగ్న‌సిస్ కోసం కాద‌ని, హాట్ స్పాట్స్ లో ప‌రిస్థితి మెరుగుప‌డుతోందా లేక వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌వుతోందా అన్న‌దానిపై స‌ర్వైలెన్స్ కోస‌మేన‌ని చెప్పారు.