ఢిల్లీ,బెంగళూరులో వందల స్కూళ్లకు బాంబు బెదిరింపులు..హైఅలెర్ట్..భయాందోళనలో విద్యార్థులు, పేరెంట్స్

ఢిల్లీ,బెంగళూరులో వందల స్కూళ్లకు బాంబు బెదిరింపులు..హైఅలెర్ట్..భయాందోళనలో విద్యార్థులు, పేరెంట్స్

దేశరాజధాని ఢిల్లీలో, బెంగళూరు నగరాలు బాంబు బెదిరింపులతో మరోసారి ఉలిక్కిపడ్డారు. శుక్రవారం (జూలై18) ఉదయం ఢిల్లీలో 20 స్కూళ్ళకు, బెంగళూరులో 40 కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలో స్కూళ్లకు గత నాలుగురోజులుగా వరసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. పశ్చిమ ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లోని ఓ పాఠశాల ఆవరణలో బాంబు ఉందని బెదిరింపు ఈమెయిల్ పంపారు గుర్తు తెలియని దుండగులు. అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 

రోహిణి సెక్టార్ 3లో ఉన్న అభినవ్ పబ్లిక్ స్కూల్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. పశ్చిమ విహార్ ప్రాంతంలోని రిచ్‌మండ్ గ్లోబల్ స్కూల్‌కు కూడా సోమవారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది. శుక్రవారం ఉదయం రోహిణి సెక్టార్ 24లోని సావరిన్ స్కూల్‌కు కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఒకే రోజు ఢిల్లీ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్ లతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 

బాంబు బెదిరింపు మెయిల్లో ఏముంది..

పోలీసుల కథనం ప్రకారం..మీ స్కూల్ లోని క్లాస్ రూంలలో బాంబు పెట్టాం.. నల్లటి ప్లాస్టిక్ కవర్ లలో బాంబులు ఉంచాం.. మిమ్ములను ప్రతి ఒక్కరిని ఈ ప్రపంచం నుంచి పంపించేస్తాను. మీలో ఏ ఒక్కరూ బ్రతకరు. మీ మరణవార్త విని నేను సంతోషంగా నవ్వుతాను.. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వారి పిల్లల ఛిద్రమౌన శరీరాలను చూసి రోదించడం నేను చూస్తాను.. అంటూ  మెయిల్ లో రాయడం కలకలం రేపుతోంది. 
అయితే ఇప్పటివరకు బెదిరింపులు వచ్చిన స్కూళ్లలో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు.   

బెంగళూరులోనూ చాలా స్కూళ్లకు బెదిరింపులు.. 

శుక్రవారం ఉదయం బెంగళూరు నగరంలోని దాదాపు 40 ప్రైవేట్ పాఠశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో నగరం భయాందోళనలకు గురైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా తనఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యలుగా స్కూళ్లను ఖాళీ చేయించారు. బెదిరింపులు వచ్చిన విద్యాసంస్థల్లో బాంబు స్వ్కాడ్ ,డాగ్ యూనిట్లతో తనిఖీలు చేశారు. ఒకేరోజు ఒక్కసారిగా 40 స్కూళ్లకు బెదిరింపులురావడంతో నగరం అంతటా హై అలర్ట్ జారీ చేశారు. విద్యార్థులు ,సిబ్బంది భద్రతకు అత్యవసర చర్యలు చేపట్టారు. 

అయితే ఇప్పటివరకు బెదిరింపులు వచ్చిన స్కూళ్లలో ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఢిల్లీలోని 20 పాఠశాలలకు ఇలాంటి ఇమెయిల్ బెదిరింపులు వచ్చిన కొన్ని గంటలకే ఈ సంఘటన జరిగింది. గత నాలుగు రోజులుగా ఢిల్లీలో ఇలాంటి బూటకపు బాంబు బెదిరింపులు వరుసగా వస్తున్నాయి..ముఖ్యంగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు వస్తున్నాయి. దీంతో పటిష్టమైనభద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.