గ్రూప్​ 1కు 3,80,202 దరఖాస్తులు

గ్రూప్​ 1కు 3,80,202 దరఖాస్తులు
  • పోటీలో 51,553 మంది సర్కార్​ ఉద్యోగులు
  • అప్లై చేసుకున్నోళ్లలో పురుషులు 2.28 లక్షలు, మహిళలు 1.51 లక్షలు 
  • పీహెచ్​డీ, ఎంఫిల్​ చేసినోళ్లూ పోటీలో

హైదరాబాద్​, వెలుగు: గ్రూప్​1 పోస్టులకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. 503 పోస్టులకు 3,80,202 మంది అప్లై చేసుకుంటే.. అందులో 51,533 మంది ప్రభుత్వ ఉద్యోగులే. మొత్తంగా ఒక్కో పోస్టుకు సగటున 756 మంది పోటీలో నిలిచారు. మే 2 నుంచి జూన్​ 4 దాకా గ్రూప్​ 1 అప్లికేషన్లను తీసుకున్న సంగతి తెలిసిందే. అప్లై చేసిన వారిలో అబ్బాయిలే ఎక్కువ. 2,28,951 మంది పురుషులు జాబ్​లకు పోటీ పడుతుండగా.. 1,51,192 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. 59 మంది ట్రాన్స్​జెండర్లూ పోటీలో ఉన్నారు. చదువుల వారీగా చూస్తే డిగ్రీ చదివినోళ్లు 2,53,490 మంది గ్రూప్​1కు అప్లై చేసుకోగా.. పీజీ చదివినోళ్లు 1,22,826, ఇంటిగ్రేటెడ్​ డిగ్రీ చేసినోళ్లు 1,781, పీహెచ్​డీ చేసిన వాళ్లు 1,681 మంది ఉన్నారు.  ఎంఫిల్​ చేసిన అభ్యర్థులు 424 మంది పోటీ పడుతున్నారు. 6,105 మంది దివ్యాంగ అభ్యర్థులు అప్లై చేశారు.  

ముందు తక్కువ.. చివర్లో ఎక్కువ
గ్రూప్​ 1 నోటిఫికేషన్​ విడుదలైన తర్వాత తొలుత దరఖాస్తులు తక్కువే వచ్చాయి. కానీ, గడువు దగ్గరపడే కొద్దీ పెరిగాయి. మే 2 నుంచి మే 16 వరకు  తొలి15 రోజుల్లో 1,26,044 మంది మాత్రమే అప్లై చేశారు. రోజుకు సగటున 8 వేల దాకా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాతి 13 రోజులు (మే 29 వరకు) 1,40,539 మంది అప్లై చేసుకోగా సగటున రోజూ 10,769 అప్లికేషన్లు అందాయి. ముందు ప్రకటించిన దాని ప్రకారం మే 31 వరకే చివరి తేదీ ఉండడంతో.. మే 30, 31 రెండు రోజుల్లోనే 85 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత గడువు పెంచడంతో జూన్​ 1–4 మధ్య 28,559 అప్లికేషన్లు వచ్చాయి.  
ఇబ్బందులు రాలె
అప్లికేషన్ల ప్రక్రియలో అభ్యర్థులకు ఇబ్బందులు రాకుండా టీఎస్​పీఎస్సీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దీంతో పెద్దగా ఇబ్బందులు రాలేదు. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఓ సెల్​ను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించారు. ఇటు కమిషన్​ వెబ్​సైట్​లోనూ ఫిర్యాదులు, సర్వర్​ లోపాలపై ‘రైజ్​ ఏ గ్రీవెన్స్​’ పేరిట ఓ కాలమ్​ను ఏర్పాటు చేశారు.