ఆరేండ్లలో 50కిపైగా దొంగతనాలు.. జైలు నుంచి విడుదలైన 25 రోజుల్లోనే 8 చోరీలు

ఆరేండ్లలో 50కిపైగా దొంగతనాలు.. జైలు నుంచి విడుదలైన 25 రోజుల్లోనే 8 చోరీలు
  • చందానగర్లో గజ దొంగ అరెస్ట్

చందానగర్, వెలుగు: జైలు నుంచి విడుదలైన 25 రోజుల్లో 8 దొంగతనాలకు పాల్పడిన ఓ గజ దొంగను చందానగర్​ పోలీసులు అరెస్ట్​చేశారు. అతని నుంచి రెండు బైకులు, 8 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా మరికల్​మండలం జిన్నారం గ్రామానికి చెందిన ముద్దంగి భీమేశ్(​ 25) కూలీ పనులు పనిచేసేవాడు. పని చేయగా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు ప్రారంభించాడు. తాళం వేసిన ఇండ్లను గుర్తించి రాత్రి వేళ చోరీలకు పాల్పడ్డాడు. ఇంట్లోని నగలు, డబ్బుతోపాటు పార్కింగ్​చేసిన బైక్​లను ఎత్తుకెళ్తున్నాడు.

భీమేశ్​2019 నుంచి ఇప్పటివరకు ఆరేండ్లలో 50కిపైగా దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 42 కేసుల్లో ఇప్పటికే జైలుకు కూడా వెళ్లాడు. సెప్టెంబర్​ 23న సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి విడుదలైన భీమేష్.. కేవలం 25 రోజుల్లో 8 దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇందులో చందానగర్​పరిధిలో రెండు బైకులు, ఒక ఇంట్లో దొంగతనం, దుండిగల్​లో ఒక ఇంట్లో దొంగతనం, మక్తల్​లో  ఒకే రోజుల రెండు ఇండ్లలో దొంగతనాలు, చైతన్యపురిలో ఒక దొంగతనం, హయత్​నగర్​లో ఒక బైక్ కొట్టేశాడు. ఈ 8 కేసుల్లో భీమేశ్​ను అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించారు.