ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడు, డా.ఉమర్ ఉన్ నబీ.. ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ బ్లాస్ట్ కు ముందు వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆత్మాహుతి దాడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. ఆత్మాహుతి అంటే బలిదానం అని.. ఇది అమరులయ్యే ఆపరేషన్ అని.. ఇస్లాంలోనూ దీనికి చోటుంది.. అంటూ వెలువడిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోపై 2025 నవంబర్ 19న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
ఇస్లాం ప్రకారం ఆత్మాహుతి దాడులు పాపమని అన్నారు. బలిదానం పేరున అమాయకులను పొట్టనపెట్టుకోవడం క్షమించరాని నేరమని అన్నారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ను సమర్థించుకునేందుకు డా.ఉమర్ ఉన్ నబీ విడుదల చేసిన వీడియోలో నిజం లేదని అన్నారు. ఇస్లాం ప్రకారం ఆత్మహత్య, ఆత్మాహుతి దాడులు తప్పని అన్నారు. ఇస్లాం చట్టాలు ఇలాంటి చర్యలను అంగీకరించవని తెలిపారు. నబీ చెప్పినట్లు ఆత్మాహుతి దాడులను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోలేదని.. టెర్రరిజంతో సాధించేది ఏమీ లేదని అన్నారు.
ఈ చర్యలకు బాద్యులెవరు..?
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా.. ఇక నుంచి కశ్మీర్ ప్రజలు ఎవరూ టెర్రర్ గ్రూపులో పాల్గొనరని అన్నారు. ఆరు నెలలుగా ఎవరూ ఉగ్రవాదుల శిబిరాల్లో చేరలేదని అన్నారు. మరి వీళ్లెవరు..? ఉగ్ర మూకలను గుర్తించడంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు.
2025, నవంబర్ 11న భారీ పేలుడుతో దేశరాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న ఏన్ఐఏ విచారణ వేగవంతం చేసింది.
