ఆన్‌‌లైన్‌‌లో అమ్మకాలకు సొంత ప్లాట్ ఫాం

ఆన్‌‌లైన్‌‌లో అమ్మకాలకు సొంత ప్లాట్ ఫాం
  •     చిన్న బిజినెస్‌‌లు సొంతంగా ఆన్‌‌లైన్ స్టోర్లు
  •     ఎస్‌‌ఎంఈలకు షాపిఫై, ఏఎన్‌‌ఎస్ కామర్స్ సాయం
  •     కంట్రోలంతా  బ్రాండ్ల చేతిలోనేబిజినెస్‌‌

డెస్క్, వెలుగు: ఫిజికల్ స్టోర్లలో ప్రొడక్ట్‌‌లను అమ్ముకోలేని చాలా  చిన్న బిజినెస్‌‌లు  ఆన్‌‌లైన్‌‌గా తమ ప్రొడక్టులను విక్రయిస్తున్నాయి.  పెద్ద పెద్ద ఈకామర్స్ ప్లాట్‌‌ఫామ్‌‌లు అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్‌‌లలో కాకుండా సొంతంగా ఆన్‌‌లైన్ దుకాణాలను తెరుస్తున్నాయి. గత కొన్ని నెలల నుంచి ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఫెస్టివ్ సీజన్‌‌ సేల్స్ టైమ్‌‌లో మరింత పెరిగింది. ఆన్‌‌లైన్ సెల్లింగ్ అంటే కేవలం పెద్ద ఈకామర్స్ ప్లేయర్లు అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్‌‌లతో భాగస్వామ్యం కుదుర్చుకోవాల్సినవసరం లేదని, సొంతంగా స్టోర్లు తెరుచుకోవచ్చని కంపెనీలు చెబుతున్నాయి. సొంతంగా ఆన్‌‌లైన్‌‌ స్టోర్లను తెరుచుకుని, ఎండ్–టూ–ఎండ్ ఈకామర్స్ సొల్యూషన్స్ అందించేందుకు చిన్న బిజినెస్‌‌లకు  షాపిఫై, ఏఎన్‌‌ఎస్ కామర్స్, మ్యాక్స్‌‌హోల్‌‌సేల్ వంటి కంపెనీలు సాయం చేస్తున్నాయి. డైరెక్ట్–టూ–కన్జూమర్(డీ2సీ)కు ఎప్పటికీ గ్రోత్ ఉంటుందని షాపిఫై అధికార ప్రతినిధి అన్నారు. గ్రాస్ మర్కండైజ్ వాల్యులో 2018తో పోలిస్తే 2019లో తాము 60 శాతం గ్రోత్‌‌ను నమోదు చేశామన్నారు. 2020 తొలి ఆరు నెలల్లో కూడా ఇండియాలో కొత్త  షాపిఫై స్టోర్లు 123 శాతం పెరిగినట్టు చెప్పారు. వైజాగ్, సూరత్, నాగ్‌‌పూర్, ఆగ్రా వంటి టైర్ 2 నగరాల్లోని బ్రాండ్లు చాలా వరకు ఆన్‌‌లైన్‌‌లోకి మారుతున్నట్టు మరో ఈకామర్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఏఎన్‌‌ఎస్ కామర్స్ చెప్పింది. మార్కెటింగ్ కోసం మంచి టూల్స్‌‌ను అడుగుతున్నాయని ఏఎన్‌‌ఎస్ కామర్స్ కోఫౌండర్ సుశాంత్ పురి తెలిపారు. బీ2బీ, బీ2సీ మోడల్స్‌‌లో ఆన్‌‌లైన్‌‌ బ్రాండ్ స్టోర్లు పెరుగుతున్నట్టు చెప్పారు.

బ్రాండ్ ఒకవేళ తన సొంతంగా ఆన్‌‌లైన్‌‌లో అమ్మకానికి వెళ్తే.. ఎలాంటి ఆఫర్‌‌‌‌ను కస్టమర్లకు ఇవ్వాలి.. ఎంత డిస్కౌంట్ ఇవ్వొచ్చు అనే విషయాలపై కంట్రోలంతా వారి చేతులోనే ఉంటుంది. కస్టమర్లకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన డేటా కూడా వేరే వాళ్ల చేతిలోకి పోదు. ‘ఫెస్టివ్ సీజన్‌‌లో బ్రాండ్లు బెటర్ సబ్‌‌స్క్రిప్షన్‌‌ను, లోయల్టీ ప్రోగ్రామ్స్‌‌ను, ఫ్రీ షిప్పింగ్, ఉచితాలు, ఫెస్టివ్ కాంబోలు, బండిల్స్, స్పెషల్ ఫెస్టివ్ కలెక్షన్లను వారి వెబ్‌‌సైట్లలో ఆఫర్ చేశాయి. మార్కెట్‌‌ప్లేసెస్‌‌లో ఆఫర్ చేసే ధరలకు సమానంగా ఇవి ఉన్నాయి. అలాగే క్రెడ్, ఫోన్‌‌పే లాంటి పేమెంట్ గేట్‌‌వే సంస్థలతో కూడా బ్రాండ్లు కోలాబరేట్ అయ్యాయి’ అని సుశాంత్ పురి చెప్పారు. ఇన్నొవేటివ్ ప్రొడక్ట్‌‌ లైన్స్ ఉన్న చిన్న వ్యాపారాలు మంచి గ్రోత్‌‌ను నమోదు చేసినట్టు చెప్పారు. పర్సనల్ కేర్, ఎఫ్‌‌ఎంసీజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషిన్‌‌కు సంబంధించిన బ్రాండ్లలో 40 శాతం నుంచి 80 శాతం వరకు మంత్లీ గ్రోత్ నమోదైంది. జనరిక్ రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఆన్‌‌లైన్‌‌గా అమ్మేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఢిల్లీకి చెందిన మ్యాక్స్‌‌హోల్‌‌సేల్ కూడా తన ప్లాట్‌‌ఫామ్‌‌పై స్టోర్ల సంఖ్యను పెంచుకుంది. అంతేకాక ప్రొడక్ట్‌‌లకు వేర్‌‌‌‌హౌస్ ఫెసిలిటీస్‌‌నూ ఇది ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం తన ప్లాట్‌‌ఫామ్‌పై 25 వేల మంది రిటైలర్స్ ఉన్నారని, కరోనాకు ముందు ఈ సంఖ్య కేవలం 8 వేలని మ్యాక్స్‌‌హోల్‌‌సేల్ తెలిపింది. ఫెస్టివ్ సీజన్‌‌లో రిటైలర్స్ రెవెన్యూ 40 శాతం పెరుగుతుందని తాము భావించామని, కానీ రోజువారీ సేల్స్‌‌లో 60 శాతం పెరుగుదలను చూశామని ఇది అంచనాలకు మించి ఉందని మ్యాక్స్‌‌హోల్‌‌సేల్  కోఫౌండర్ సామ్రాట్ అగర్వాల్ పేర్కొన్నారు.

షోరూం నుంచి ఆన్‌‌లైన్‌‌కి..

ఇండిపెండెంట్ డీ2సీ బ్రాండ్ వెబ్‌‌సైట్లు ఆర్డర్ వాల్యూమ్‌‌లో 88 శాతం గ్రోత్‌‌ను నమోదు చేస్తున్నాయి. మార్కెట్‌‌ప్లేసెస్‌‌లో వీటి ఆర్డర్ వాల్యూమ్ గ్రోత్‌‌ 32 శాతంగా ఉండేదని యునికామర్స్ చెప్పింది. బ్యూటీ అండ్ వెల్‌‌నెస్, ఫ్యాషన్ అండ్ యాక్ససరీస్, ఎఫ్‌‌ఎంసీజీ అండ్ అగ్రికల్చర్ సెక్టార్లలోని డీ2సీ బ్రాండ్లలో గ్రోత్‌‌ ఎక్కువగా ఉందన్నారు. ఫ్యాషన్ డీ2సీ బ్రాండ్ ఫ్యాబ్‌‌అలే సెప్టెంబర్ మధ్య నుంచి తన కస్టమర్ల సంఖ్య పెరిగిందని చెప్పింది. ప్రీ కరోనా లెవెల్స్‌‌లో 60 శాతం నుంచి 70 శాతానికి వాక్‌‌–ఇన్స్ చేరుకున్నాయని కంపెనీ కోఫౌండర్ తాన్వి మాలిక్ చెప్పారు. చాలా మంది ఆఫ్‌‌లైన్ షాపర్లు ఆన్‌‌లైన్ స్టోర్లలోకి మారుతున్నారని పేర్కొన్నారు. తమ కంపెనీ కూడా సోషల్ మీడియా కంటెస్టెంట్లు, స్పెషల్ సేల్ డేస్ ద్వారా కస్టమర్లకు మరింత దగ్గరవుతున్నట్టు చెప్పారు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభం కావడంతో అప్పీరల్‌‌కు, ముఖ్యంగా ఫంక్షన్లకు వేసుకునే డ్రస్‌‌లకు డిమాండ్ పెరిగినట్టు తెలిపారు. అలాగే మదర్ అండ్ బేబీ హెల్త్‌‌కేర్ బ్రాండ్ మామాఎర్త్ కూడా ఈ ఫెస్టివ్ సీజన్‌‌లో మూడు రెట్లకు పైగా గ్రోత్‌‌ను నమోదు చేసింది. స్కిన్‌‌కేర్, హెల్త్‌‌కేర్ వంటి బ్రాండ్లు కూడా మంచి గ్రోత్‌‌ను రికార్డు చేశాయి. ఆన్‌‌లైన్ కొనుగోళ్లు చాలా ఏళ్ల నుంచే ఉన్నప్పటికీ.. ఇటీవల కరోనాతో రిటైల్ షాపులన్ని మూతపడటంతో ఆన్‌‌లైన్ సెగ్మెంట్ బాగా పెరిగింది.