దొడ్డు వడ్లు  దించుకుంటలేరు.. నల్గొండ జిల్లాలో పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు  

దొడ్డు వడ్లు  దించుకుంటలేరు.. నల్గొండ జిల్లాలో పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు  

మిర్యాలగూడ, వెలుగు:  స్టాక్ పెట్టుకునేందుకు స్థలం  లేదని, ధాన్యంలో తాలు శాతం అధికంగా ఉందని సాకులు చెబుతూ కొనుగోలు సెంటర్ల ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న దొడ్డు వడ్లను రైస్​ మిల్లర్లు దించుకోవట్లేదు. దీంతో నల్గొండ జిల్లాలోని కొనుగోలు సెంటర్లలో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 1.01  లక్షల ఎకరాల సన్నరకం,4.55 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు కలిపి మొత్తం 5.56 లక్షల ఎకరాల వరి సాగు చేశారు. ఇందులో సన్న రకం వడ్లు 2.55 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు ధాన్యం 11.17 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 13.72 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇప్పటికే వరి కోతలు పూర్తికాగా సన్న వడ్లను రైస్ మిల్లులకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.  దొడ్డు వడ్లను ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లకు తీసుకొస్తున్నారు. 25 రోజుల కిందనే 70 నుంచి 80 శాతం వడ్లు సెంటర్లకు చేరాయి. ఈనెల 12న  272  ధాన్యం  కొనుగోలు సెంటర్లను ఓపెన్ చేయగా కొనుగోలు ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఐదు మిల్లుల్లోనే.. 

జిల్లాలో 11.17 లక్షల మెట్రిక్ టన్నుల  దొడ్డు వడ్లను 121 ఐకేపీ, 151 పీఏసీఎస్(పీపీసీ) సెంటర్ల నుంచి దించుకునేందుకు నల్గొండ 48, మిర్యాలగూడ 60 మిల్లులు కలిపి మొత్తం 108 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైస్ మిల్లులకు సివిల్ సప్లయి శాఖ అలాట్ చేసింది.  కానీ ప్రస్తుతం ఐదు మిల్లులే 60 లక్షల విలువైన వడ్లను దించుకుంటున్నాయని జిల్లా స్థాయి అధికారులే వెల్లడించటం కొనుగోలు ప్రక్రియ జాప్యం తీరుకు నిదర్శనం. 

స్థలం లేదనే సాకుతో డిలే.. 

రెండు సీజన్లు ముగిసి మూడో సీజన్​ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన వడ్లను సీఎంఆర్(కస్టం మిల్లింగ్ రైస్)ను చేసి ఇన్​టైంలో ఇవ్వట్లేదన్నది తెలిసిందే. కాగా దొడ్డు వడ్ల స్టాక్ పెట్టుకునే స్థలం లేదని సివిల్ సప్లయి, ఐకేపీ, పీఏసీఎస్ అధికారులకు చెబుతున్నా మిర్యాలగూడ  రైస్ మిల్లర్లు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వడ్లను దించుకొని నల్గొండ జిల్లాలో పండిన దొడ్డు వడ్లను దించుకోకుండా డిలే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

స్పీడప్​ చేస్తాం.. 

యాసంగి సీజన్​వడ్లకు మిర్యాలగూడ పరిధిలో 60 రైస్ మిల్లులను కేటాయించినం. ఐకేపీ, పీపీసీ సెంటర్ల నుంచి వడ్లను తరలించడం స్పీడప్​ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.  - సివిల్ సప్లై డీటీ రామకృష్ణారెడ్డి