రైతుల కష్టం నీటి పాలు!..42 రోజులుగా కొనసాగుతున్న మంజీరా వరద ఉధృతి

రైతుల కష్టం నీటి పాలు!..42 రోజులుగా కొనసాగుతున్న మంజీరా వరద ఉధృతి
  •  2,500 ఎకరాల్లో నీట మునిగిన వరి పంట
  •  చాలా రోజుల పాటు నీళ్లలో ఉండడంతో నల్లగా మారిన వరి పైర్లు 
  •  పెట్టుబడి కూడా చేతికందకుండా పోయిందని రైతుల ఆవేదన
  •  ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

మెదక్, సంగారెడ్డి, పాపన్నపేట, వెలుగు: మంజీరా నదికి భారీ వరద రావడంతో వేలాది మంది రైతుల కష్టం నీటి పాలైంది. ఎగువన ఉన్న కర్నాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో  దిగువన సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ కు వరద పోటెత్తింది. ప్రాజెక్టు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మొదట 2 గేట్లతో మొదలుకుని ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో కు అనుగుణంగా 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది. 

దీంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతంగా ప్రవహించింది. సింగూర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండినపుడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం సహజమే. కానీ గడిచిన 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 రోజుల పాటు మంజీరా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాల్లో సుమారు 2,500 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నెల రోజులకు పైగా నీటిలోనే ఉండడంతో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద తాకిడి పెరిగి వందల ఎకరాలు నీటి మునిగాయి. ఎగువ, దిగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలోని మనూర్, పుల్కల్, చౌటకూర్, ఆందోల్ మండలాల్లో దాదాపు 400 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నాలుగు మండలాల పరిధిలో 19 గ్రామాల్లో పంటలు పాడయ్యాయి.

 పుల్కల్ మండలంలో పోచారం, పుల్కల్, మిన్పూర్, కోడూర్, ఇసోజిపేట, గొంగ్లూర్, చౌటకూర్ మండలంలో గంగోజీపేట, శివ్వంపేట, వెండికోల్, వెంకటకిష్టాపూర్, కోర్పోల్, సారఫ్ పల్లి, అందోల్ మండలంలో అల్మాయిపేట, సాయిబాన్ పేట, పోసానిపేట, అన్నాసాగర్, చింతకుంట, మాసాన్ పల్లి గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో వరద నీరు చేరి పంటలు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

మెదక్ జిల్లాలో..

జిల్లాలోని పాపన్నపేట మండలంలో మంజీరా నది పరివాహక ప్రాంతంలోని కొడపాక, గాజులగూడెం, నాగ్సాన్ పల్లి, ఎల్లాపూర్, పోడిచన్​పల్లి, పొడిచన్ పల్లి తండా, గాంధారి పల్లి, కుర్తివాడ, మిన్పూర్, పాపన్నపేట, రామతీర్థం, ముద్దాపురం గ్రామాల్లో వందల ఎకరాల్లో పంట నీటిపాలైంది.  వ్యవసాయ అధికారుల సమాచారం ప్రకారం మొత్తం మండల వ్యాప్తంగా 2,041 మంది రైతులకు సంబంధించి 2,094 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. 

 క్లస్టర్ల వారీగా చూస్తే బాచారంలో 360 మంది రైతులకు  సంబంధించి 298 ఎకరాలు, పాపన్నపేటలో 886 మంది రైతులకు సంబంధించి 1,034, నాగ్సానిపల్లిలో 172 మంది రైతులకు సంబంధించి 204, కొత్తపల్లిలో 311 మంది రైతులకు 359, చీకోడ్ లో 312 మంది రైతులకు సంబంధించి 199 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నెల రోజులకు పైగా పంట నీటిలో ఉండడంతో పూర్తిగా పాడైంది. రైతులకు పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి నెలకొంది.

మూడెకరాల పొలం పాడైంది

నేను వానాకాలంలో మూడెకరాల్లో వరి వేసిన. రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టా. మంజీరాకు వరద రావడంతో పంట మొత్తం నీట మునిగింది. నెల రోజులకు పైగా పొలంలో నీళ్లు ఉండడంతో పంట మొత్తం పాడైంది. పెట్టుబడి నీళ్లపాలైంది. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. హన్మంతు, రైతు, కొడుపాక