- 11.06 లక్షల ఎకరాలతో ఆల్‌టైం రికార్డు సృష్టించిన మక్కలు
- ఈయేడు 2.37 లక్షల ఎకరాల్లో జొన్నల సాగు
- సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక
హైదరాబాద్, వెలుగు: యాసంగి పంటల్లో వరి నాట్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభమై మూడు నెలలైనా రైతులు ఇంకా వరినాట్లు వేస్తున్నారు. వరంగల్ జిల్లా పాకాల చెరువు ప్రాంతాల్లో నేటికీ రైతులు నాట్లు వేస్తున్నరు. దీంతో ఇప్పటివరకూ యాసంగిలో ఒక్క వరి సాగే 52 లక్షలకు చేరింది. బుధవారం నాటికి రాష్ట్రంలో యాసంగి సాగు అన్ని పంటలు కలిపి 70.50 లక్షల ఎకరాల్లో సాగు నమోదైనట్లు వ్యవసాయశాఖ తన అధ్యయనంలో తేల్చింది. ఈ మేరకు సర్కారుకు నివేదిక అందించింది. ఈ యాసంగిలో ఇప్పటివరకూ సాగైన పంటల్లో వరి టాప్‌లో నిలిచింది.
అయితే వరి నాట్లు ఇంకా కొనసాగుతుండడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వరి తరువాత 11.06 లక్షల ఎకరాల్లో మక్కలు సాగయ్యాయి. ఎన్నడూ లేనిది ఈయేడు జొన్న సైతం 2.37లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. తరువాత స్థానంలో వేరుసెనగ 1.86 లక్షల ఎకరాలు, శనగపప్పు (బెంగాల్‌గ్రామ్) 1.79 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అదేవిధంగా మినుములు 35 వేల ఎకరాలు, చెరుకు15 వేల ఎకరాలు, పొద్దుతిరుగుడు14 వేల ఎకరాల్లో సాగయ్యాయి.
మక్కల సాగులో ఆల్‌టైం రికార్డు
యాసంగి సీజన్ లో మక్కల సాధారణ సాగు 6.45 లక్షల ఎకరాలు కాగా.. ఈయేడు అత్యధికంగా 11 లక్షల ఎకరాల్లో సాగై రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ గత ఏడాది యాసంగిలో 9.13 లక్షల ఎకరాల్లో మక్కల సాగు రికార్డు కాగా ఈయేడు ఆ రికార్డులను తిరగరాసింది. గత రెండేళ్లుగా రైతుల నుంచి మద్దతు ధరకు సర్కారు మక్కలు కొనుగోళ్లు చేస్తోంది. మార్కెట్ లో మద్దతు ధరకు తక్కువగా విక్రయాలు జరుగుతుంటే వెంటనే మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా రంగంలోకి దించి మక్కలను కొనుగోలు చేస్తోంది. దీంతో మక్కలకు మార్కెట్లో మద్దతు ధర దక్కుతుందనే భరోసాతో రైతులు యాసంగిలో మక్కల సాగు బాగా పెంచారు.
ప్రధానంగా ఖమ్మం జిల్లాలో 1.65 లక్షల ఎకరాల్లో, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.25 లక్షలు, మహబూబాబాద్ జిల్లాలో 1.02 లక్షలు, వరంగల్ జిల్లాలో 1.01 లక్షలు, నిర్మల్‌లో లక్ష ఎకరాల్లో మక్క సాగుచేశారు. తరువాత భద్రాద్రి కొత్తగూడెంలో 73 వేల ఎకరాల్లో, హన్మకొండ జిల్లాలో 65 వేలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 44 వేలు, కామారెడ్డిలో 34 వేలు, నిజామాబాద్ జిల్లాలో 32 వేలు, జగిత్యాల జిల్లాలో 31 వేల ఎకరాల్లో మక్కల సాగు నమోదైంది.
