- చివర్లో బోర్లు వట్టిపోవడంతో ఎండిన పంటలు
- మళ్లీ ఈ సీజన్లో వరి సాగుకే సిద్ధమవుతున్న రైతులు
మహబూబ్నగర్, వెలుగు: మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో ఏటికేడు వరి సాగు పెరుగుతోంది. సాగునీటి వనరులు అంతంత మాత్రంగానే ఉన్నా.. రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడి బోర్లు రీచార్జ్ అవుతున్నాయి. దీంతో వానాకాలం సీజన్ మాదిరిగానే.. యాసంగిలోనూ రైతులు పెద్ద ఎత్తున వరి సాగుకు సిద్ధమవుతున్నారు.
రెండు జిల్లాల్లో 4 లక్షల ఎకరాలు..
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగు కానుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా 2.01 లక్షల ఎకరాల్లో వరి, 19,388 ఎకరాల్లో మక్కలు, 15,34 ఎకరాల్లో వేరుశనగ, 1,169 ఎకరాల్లో జొన్న, 252 ఎకరాల్లో ఆముదాలు, 215 ఎకరాల్లో రాగులు సాగు కానుండగా, నారాయణపేట జిల్లాలో 1.80 ఎకరాల్లో వరి, 15ఎకరాల్లో జొన్న, 800 ఎకరాల్లో కూరగాయలు, వెయ్యి ఎకరాల్లో కందులు, 300 ఎకరాల్లో అలసందలు, వెయ్యి ఎకరాల్లో తెల్ల కుసుమలు సాగు అవుతాయని అంచనా వేశారు. నిరుడు యాసంగిలో రెండు జిల్లాల్లో కలిపి 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈ ఏడాది 3.80 లక్షల ఎకరాలకు పెరుగుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు.
పెరిగిన గ్రౌండ్ వాటర్..
గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాలు 0.5 మీటర్లకు పెరిగాయి. నిరుడు ఇదే టైంలో మహబూబ్నగర్ జిల్లాలో 5.89 మీటర్ల లెవల్లో నీరు ఉండగా.. ప్రస్తుతం 5.27 మీటర్లలోనే నీటి లభ్యత ఉంది. ఈ లెక్కల ప్రకారం గతేడాదికంటే ఈసారి 0.5 మీటర్ల పైకి భూగర్భ జలాలు పెరిగాయి. అయితే మిడ్జిల్, మూసాపేట, కౌకుంట్ల, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల్లో మాత్రమే గతేడాదికంటే ఈసారి భూగర్భ జలాలు కొంత మేర పెరిగాయి. మిగతా మండలాల్లో నిరుడుతో పోలిస్తే కొంత తగ్గాయి. కానీ, నారాయణపేట జిల్లాలో చాలా చోట్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. కోస్గి, చేగుంట, హిందుపూర్, మద్దూరు, మక్తల్, మరికల్, అప్పిరెడ్డిపల్లి, కొల్లంపల్లి, నారాయణపేట, నర్వ, ఊట్కూరు, సర్జఖాన్పేట, ధన్వాడ, కొండపూర్, వెంకటాపూర్, మాగనూరు, కృష్ణ, కొల్పూర్, లింగంపల్లి ప్రాంతాల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాలు పెరిగాయి. మిగతా ప్రాంతాల్లో మాత్రమే నిరుడు కంటే గ్రౌండ్ వాటర్ కొంత మేర తగ్గింది.
నిరుడు చివరి దశలో ఎండిన వరి చేన్లు..
గతేడాది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరింది. స్థానికంగా కురిసిన వర్షాలకు రెండు జిల్లాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. అయితే గ్రౌండ్ పెరగడంతో రైతులు గత యాసంగిలో పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. కానీ, వాతావరణంలో వచ్చిన మార్పులతో జనవరి నుంచి ఎండలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు ముదరడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోయాయి. ఇదే సమయంలో గ్రౌండ్ వాటర్ కూడా పడిపోతూ వచ్చింది. మార్చి నెల వచ్చే వరకు భూగర్భ జలాలు తగ్గాయి. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో సాగునీటి కాలువల ద్వారా కూడా నీటి విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వరికి చివరి తడులు అందక రెండు జిల్లాల్లో పెద్ద మొత్తంలో వరి చేన్లు ఎండిపోయాయి. కొందరు చేసేది లేక పశువులకు మేతగా వదిలేశారు. అయితే ఈ యాసంగిలో కూడా నిరుడు కంటే 60 వేల ఎకరాలు అదనంగా వరి సాగు కానున్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తుండగా, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మూడేళ్లుగా యాసంగి వరి సాగు వివరాలు..
జిల్లా 2023 2024 2025
మహబూబ్నగర్ 1,12,598 1,50,000 2,01,000
నారాయణపేట 1,30,000 1,70,000 1,80,000
