సాగర్ కింద ఎండుతున్న వరి.. కాలువ నీళ్లు బంద్, బోరు బావుల్లోనూ తగ్గిన నీటి మట్టం

సాగర్ కింద ఎండుతున్న వరి.. కాలువ నీళ్లు బంద్, బోరు బావుల్లోనూ తగ్గిన నీటి మట్టం
  •    ఎగువ రాష్ట్రాల నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద నీరు చేరలే​
  •     ఆందోళనలో అన్నదాతలు
  •     చివరి తడికి నీళ్లు వదలాలని అధికారులకు రైతుల విజ్ఞప్తి

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద వరిపొలాలు ఎండుతున్నాయి. సరిగ్గా వరి పంట చేతికి వచ్చే సమయంలో కెనాల్ నీళ్లు అందక, భూగర్భ జలాలు అడుగంటి పొలాలు దెబ్బతింటున్నాయి. ఎండా కాలాన్ని తలపిస్తున్న ఎండలతో పచ్చని పొలాలు వడబారుతున్నాయి. ఈ ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వానల్లేకపోవడం, ఎగువ రాష్ట్రాల నుంచి కూడా వరద రాకపోవడంతో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు నీరు చేరలేదు. దీంతో​ సాగర్​ ఆయకట్టు కింద దాదాపు 6 లక్షల ఎకరాలకు కేవలం బోర్లు, బావులే దిక్కయ్యాయి. 

వర్షాభావ పరిస్థితుల్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, వరి పంటలు వేయొద్దని వ్యవసాయ శాఖ అధికారులు ముందుగానే అలర్ట్ చేసినా రైతులు లైట్​ తీసుకున్నారు. బోర్లు, బావుల్లో నీరు కనిపిస్తుండడం, ఆలస్యంగానైనా మళ్లీ వర్షాలు రాకపోతాయా అనే ఆశతో నార్లు పోసి, నాట్లు వేశారు. తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో పొట్ట దశలో ఉన్న పంట పొలాలు చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. భూగర్భ జలాలు కూడా అడుగంటుతుండడంతో చాలా వరకు బోర్లు కూడా ఆగి ఆగి పోస్తున్నాయి. దీంతో పంటలు ఎలా దక్కించుకోవాలో తెలీక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 

ఈ ఏడాది లోటు వర్షపాతం

ఈ ఏడాది వానాకాలంలో రాష్ట్రంలోని ఐదు జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో సాధారణం కన్నా 29 శాతం తక్కువగా వర్షం పడగా, ఖమ్మం జిల్లాలో 26 శాతం తక్కువగా, నాగర్​ కర్నూలు జిల్లాలో 25 శాతం, నల్గొండలో 23 శాతం, సూర్యాపేట జిల్లాలో 21 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. దీంతో వర్షాభావ పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక సాగర్​ ఆయకట్టు నుంచి నీటి విడుదల లేకపోవడంతో చెరువుల్లో ఉన్న నీళ్లు కూడా తగ్గుకుంటూ వస్తున్నాయి. 

కేవలం తాగునీటి కోసం ఇటీవల రెండుసార్లు ఖమ్మం జిల్లాలోని చెరువులకు పాలేరు, వైరా రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేశారు. ఫలితంగా కొంతమేర జలమట్టం పెరగడంతో బోర్లు, బావులకు ఊపిరిపోసినట్టయింది. చివరి ఆయకట్టు రైతుల విజ్ఞప్తి మేరకు సాగర్​ నుంచి కూడా రెండుసార్లు ఎడమ కాల్వకు నీరు విడుదల చేశారు. ఇంకొక్కసారి సాగర్​ నుంచి నీళ్లిస్తే తమ పంటలు చేతికొస్తాయని ఎడమ కాల్వ కింద చివరి ఆయకట్టు భూముల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సత్తుపల్లిలో ప్రజా ఆశీర్వాద సభ కోసం వచ్చిన సీఎం కేసీఆర్​ కు అక్కడి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నీటి విడుదల అవసరం గురించి వివరించగా, సభావేదిక పైనుంచి సీఎం సానుకూలంగా స్పందించి పంటలకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. 

పడిపోయిన భూగర్భ జలమట్టం

వర్షాలు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో అక్టోబరు నెలాఖరు వరకు భూగర్భ జలమట్టం 2.02 మీటర్ల లోతుకు పడిపోయింది. జిల్లాలో నిరుడు అక్టోబర్​ లో 2.43 మీటర్ల లోతునే సరాసరి నీటి మట్టం ఉండగా, ఈ ఏడాది అక్టోబర్ లో మాత్రం 4.45 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. ఖమ్మం జిల్లాలో ఆయకట్టేతర ప్రాంతంలో ఏకంగా 5.71 మీటర్ల లోతుకి నీటి మట్టం తగ్గింది. దీంతో కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, తల్లాడ మండలాల్లో వరిపొలాలు ఎండిపోతున్నాయి. 

ఖమ్మం జిల్లాలో గతేడాది వానాకాలం సీజన్​ లో 2,93,215 ఎకరాల్లో రైతులు వరిసాగు చేయగా, ఈసారి ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడం, సాగర్​ కాల్వల ద్వారా నీళ్లు రాకపోవడంతో వరిసాగు విస్తీర్ణం 2.64 లక్షల ఎకరాలకు తగ్గింది. అందులో కూడా దాదాపు వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని 50 వేల ఎకరాల్లో ప్రస్తుతం పంట ఎండిపోయే పరిస్థితి ఉందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేయకపోతే వంద మంది రైతులతో ఎన్నికల్లో నామినేషన్లు వేయిస్తామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. 

ALSO READ : ఏటీఎంల పుణ్యమే నిర్మాణ లోపాలా? బిఎస్ రాములు, మాజీ చైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్

ఒక్క తడితో పంట చేతికి వస్తది 

వరి పంట పొట్ట దశలో ఉంది. ఇంత కాలం చెరువులో ఉన్న నీటితో ఇంజిన్లు పెట్టి పంట కాపాడుకున్నం. ఇపుడు ఒక్క తడితో సగం పంట అయినా చేతికి వస్తది. రెండు ఎకరాలకు నీళ్లు పెట్టడానికి ఇప్పటికే రూ.7 వేలు ఖర్చు చేశా. పంటను ఎలా కాపాడాలో అర్థం కావట్లే. 
- జోనేబోయిన వెంకయ్య, పెనుబల్లి 

పెట్టుబడులన్నీ నష్టపోయా 

సాగర్ ఆయకట్టు కింద దాదాపు 12 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి పంట వేశాను. వర్షాలు పడక, సాగర్  జలాలు అందక వరి పంట పూర్తిగా ఎండిపోయింది. కంటితుడుపుగా ఇటీవలే సాగర్ జలాలు విడుదల చేసినా పంటకు నీరు అందలేదు. పెట్టుబడులన్నీ కలిపి రూ.లక్షకు పైగా నష్టపోయా. 
- ఆపతి వెంకట రామారావు, అన్నారుగూడెం