వనపర్తి/పెబ్బేరు, వెలుగు: అధికారులు, రాజకీయ నాయకులు, రైసు మిల్లర్లు కుమ్మక్కై అనుమతి లేని రైస్ మిల్లుకు కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లను తరలించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ శివారులోని మారుతి ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద ఈ వ్యవహారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కంచిరావుపల్లి గ్రామంలోని కనకదుర్గ రైస్ మిల్లు వెనక పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కేంద్రంలో రైతుల వద్ద కొనుగోలు చేసిన వడ్లను మిల్లింగ్ చేసేందుకు అనుమతి లేకుండానే ఒక మిల్లర్ అక్రమంగా తరలిస్తున్నాడు. ఆ రైస్ మిల్లుకు ఇంకా పర్మిషన్ ఇవ్వనప్పుడు ఏకంగా వడ్లను ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నుంచి మిల్లర్ తన మిల్లుకు 4 వేల బస్తాల వరకు వడ్లను తరలించాడు. డీఎస్ వో, ప్రజాప్రతినిధుల సహకారంతోనే కొనుగోలు కేంద్రం నుంచి వడ్లు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేశానని, మిల్లు నిర్మాణానికి బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ ఈఎంఐ కట్టడానికే వడ్లు మిల్లుకు తెచ్చుకున్నట్లు మిల్లుఓనర్ శ్రీనివాసులు పొంతన లేని సమాధానం ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే రెండు, మూడు రోజుల్లో పర్మిషన్ వస్తుందనే ధైర్యంతోనే వడ్లను డంప్ చేసుకుంటున్నట్లు చెబుతున్నాడు. ఇలా చెబుతూనే వడ్లు తీసుకొచ్చిన వెహికల్స్కు ట్రక్ షీట్లు కూడా ఉన్నాయని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ విషయమై డీఎస్వో కాశీ విశ్వనాథ్ ను వివరణ కోరగా.. మిల్లులో వడ్లు స్టాక్ చేసుకుంటున్న సంగతి తనకు తెలియదని, మిల్లుకు ఎలాంటి ప్రొసీడింగ్స్, పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. సెంటర్ నుంచి వడ్లు తెచ్చుకొని స్టాక్ చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఇదిలాఉంటే పర్మిషన్ లేని మిల్లుకు వడ్లను తరలించిన ఘటనలో డీఎస్వో, అందుకు సహకరించిన కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రవాణా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్గౌడ్ డిమాండ్ చేశారు.
