- జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో ఘటన
రఘునాథపల్లి(లింగాలఘనపురం), వెలుగు: వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం, సెంటర్ నిర్వాహకుల కాలయాపనతో మనస్తాపం చెందిన ఓ రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం ఏనెభావి గ్రామానికి చెందిన పొన్నం తిరుమలేశ్ నెల రోజులుగా వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నాడు.
టోకెన్ సిస్టం ద్వారా వడ్లు కాంటా వేస్తామని చెప్పిన నిర్వాహకులు, నెల రోజులుగా కాలయాపన చేస్తున్నారు. రైతు తిరుమలేశ్ కు మొదట 16వ నంబర్ టోకెన్ ఇచ్చారు. అయితే, అతని కంటే వెనక వచ్చిన రైతుల వడ్లను కాంటా వేస్తూ, తిరుమలేశ్ ధాన్యాన్ని పట్టించుకోలేదు. దీనిపై అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులను నిలదీశాడు. దీంతో మాట మార్చిన నిర్వాహకులు టోకెన్ నంబర్ 16 కాదు, 76 అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
నెల రోజుల నుంచి వడ్లను కాపాడుకుంటూ వస్తున్నానని, ఇంకా ఎన్ని నెలలు ఇక్కడే ఉంచాలంటూ తిరుమలేశ్ అసహనం వ్యక్తం చేశాడు. అధికారుల తీరుపై మనస్తాపంతో తన వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న తోటి రైతులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
