పనిచేయడం ఇష్టం లేకుంటే వెళ్లిపోండి..అధికారులపై ఎమ్మెల్యే మైనంపల్లి ఆగ్రహం

పనిచేయడం ఇష్టం లేకుంటే వెళ్లిపోండి..అధికారులపై ఎమ్మెల్యే మైనంపల్లి ఆగ్రహం

మెదక్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లను అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఊరుకోబోమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హెచ్చరించారు. జిల్లాలో పనిచేసే ఉద్దేశ్యం లేకపోతే వెళ్లిపోవాలని సివిల్ సప్లై డీఎం జగదీశ్​కు సూచించారు. శనివారం మెదక్ కలెక్టరేట్‌‌‌‌లో అడిషనల్ కలెక్టర్ నగేశ్, సివిల్ సప్లై, డీఆర్‌‌‌‌డీఏ, రెవెన్యూ ఆఫీసర్లతో ధాన్యం కొనుగోళ్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కలెక్టర్ సెలవుపై వెళ్లినప్పుడు ఇన్​చార్జిని ఎందుకు నియమించలేదని అడిషనల్ కలెక్టర్‌‌‌‌ను ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోలు వంటి కీలక సమయంలో కలెక్టర్ లేకపోవడం సరికాదన్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నా ఓ రైతు పెట్రోల్ పోసుకున్న ఘటనపై స్పందిస్తూ.. ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం, సివిల్ సప్లై మంత్రి ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఏసీ గదులు వదిలి ఫీల్డ్‌‌‌‌లో తిరిగి రైతుల సమస్యలు తెలుసుకోవాలని సివిల్ సప్లై డీఎంను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్ రాధిక రాజ్, వైస్ చైర్మన్ నరేశ్​గౌడ్ పాల్గొన్నారు.