- 96,528 మంది రైతులకు రూ.844 కోట్ల చెల్లింపు
మెదక్, వెలుగు: జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. మొదట్లో అకాల వర్షాల వల్ల కొంత ఆటంకం కలిగినా ఆ తర్వాత కేంద్రాలు అన్ని ప్రారంభమై కొనుగోలు ప్రక్రియ ఊపుందుకుంది. జిల్లాలో మొత్తం 3.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మహిళా సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో 518 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
98,142 మంది రైతుల నుంచి..
జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో సన్నరకం వడ్ల కొనుగోలుకు 100, దొడ్డురకం వడ్ల కొనుగోలుకు 418 కలిపి మొత్తం 518 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఇప్పటి వరకు 61,256 మంది రైతుల నుంచి 2,29,195 టన్నుల దొడ్డురకం, 36,886 మంది రైతుల నుంచి 1,39,125 టన్నుల సన్న రకం వడ్లు కలిపి మొత్తం 98,142 మంది రైతుల నుంచి రూ.879.92 కోట్ల విలువైన 3,68,321 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అందులో నుంచి 3,67,955 టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించారు. అదిపోను ఇంకా 366.280 టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాల్సి ఉంది.
చకచకా చెల్లింపులు
ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో వడ్ల డబ్బులు జమ చేశారు. 3,67,955 టన్నులకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగా 3,57,488 టన్నులకు ట్రక్షీట్లు జనరేట్ అయ్యాయి. ఈ మేరకు మిల్లర్ల నుంచి 3,53,390 టన్నులకు సంబంధించి అక్నాలెడ్జ్ మెంట్ రాగా రూ.844.25 కోట్లు సంబంధిత రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యాయి. ఇంకా కేవలం 1,614 మంది రైతులకు రూ.35.67 కోట్లు మాత్రమే బకాయి ఉన్నాయి. డబ్బులు అకౌంట్లో జమైన వెంటనే రైతుల సెల్ఫోన్లకు మెసేజ్ వస్తోంది.
టన్నుకు రూ.500 బోనస్
సన్న వడ్లకు కనీస మద్దతు ధర తోపాటు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ప్రస్తుత సీజన్లో 36,886 మంది రైతుల నుంచి 1,39,125 టన్నుల సన్న వడ్లు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి టన్నుకు రూ.500 చొప్పున రూ.69.56 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 23,065 మంది రైతులకు రూ.45.85 కోట్లు విడుదలయ్యాయి. ఇవిపోను ఇంకా 13,821 మంది రైతులకు సంబంధించి రూ.23.71 కోట్లు చెల్లించాల్సి ఉంది.
లక్ష్యానికి చేరువగా కొనుగోలు
జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. 518 కొనుగోలు కేంద్రాలకు 381 కొనుగోలు కేంద్రాలు మూసి వేశారు. 3.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనేది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3,68,321 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇందుకు సంబంధించి రైతులకు రూ.879.92 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.844 .25 కోట్ల చెల్లింపు పూర్తయింది. సన్న వడ్లకు సంబంధించి బోనస్ డబ్బులు సైతం రూ.45.85 కోట్లు విడుదల కాగా మిగిలిన రూ.23.71 కోట్లు త్వరలో విడుదల కానున్నాయి. – సామల జగదీశ్, సివిల్ సప్లై డీఎం
