
- యాసంగి ధాన్యం సేకరణలో 61% పూర్తి
- రైతుల ఖాతాల్లో రూ.6,671 కోట్లు జమ
- రూ.767 కోట్ల బోనస్ చెల్లించేందుకు సర్కార్ ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. సోమవారం నాటికి 61.45 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. 43.10 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. గత యాసంగి సీజన్ ఇదే కాలంలో 29.88 లక్షల టన్నులు, అంతకంటే ముందు (2022–23) సీజన్‌లో 19.62 లక్షల టన్నులు సేకరించింది.
ఈ ఏడాది యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాల సంఖ్య భారీగా పెంచింది. 2023–24 యాసంగిలో 7,178 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ సీజన్‌లో 8,245 కేంద్రాల్లో ధాన్యం సేకరించింది. 1.29 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
ఇప్పటిదాకా సేకరించిన ధాన్యంలో 27.75 లక్షల టన్నులు దొడ్డు రకం, 15.35 లక్షల టన్నులు సన్న రకం ఉన్నాయి. దాదాపు 6.58 లక్షల మంది రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. రూ.9,999.36 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా.. ఇప్పటి వరకు రూ.6,671 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు సివిల్ సప్లయ్స్ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇప్పటివరకు సన్న రకం ధాన్యం అమ్మిన రైతులకు రూ.767 కోట్ల బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.