
- ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో సన్నాలు కొంటలేరు
- తక్కువ ధరకే మిల్లర్లకు అమ్ముకుంటున్న రైతులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ సగం కూడా పూర్తి కాలేదు. 75 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటిదాకా కొనుగోలు చేసింది 32.59 లక్షల టన్నులే. ఇంకో 10 లక్షల టన్నులు కొనడం కూడా డౌటేనని అంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నొడ్లు కొనడం లేదు. ఒక వేళ ఎక్కడైనా కొంటే మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారు. మరోవైపు రైతుల నుంచి తక్కువ ధరకు మిల్లర్లు కొంటూ సొమ్ము చేసుకుంటున్నారు.సన్నొడ్లు 10.22 లక్షల టన్నులే కొన్నరు. రాష్ట్రంలో 6,640 సెంటర్ల ద్వారా వరి కొనుగోళ్లు చేపట్టాలని సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ సన్నాహాలు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ సెంటర్లు, సహకార సంఘాలు, మార్కెట్ యార్డులు కలిపి 6,391 కేంద్రాల్లో వడ్లు కొన్నారు. అయితే సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ కేంద్రాల్లో సన్నవడ్లు కొనకపోవడం, ధర పెంచకపోవడంతో రైతులంతా మిల్లర్ల బాట పట్టారు. సన్నాలకు రూ.1,400 నుంచి 1,700 వరకే ధర ఇచ్చి మిల్లర్లు కొన్నారు. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, ఖమ్మం, జనగామ, వరంగల్ అర్బన్ జిల్లాల్లో చాలా మంది రైతులు టోకెన్లకు లైన్ లో నిలబడి మరీ మిల్లర్లకే అమ్ముకున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటిదాకా సన్న వడ్లు 10.22 లక్షల టన్నులు మాత్రమే కొన్నారు. దొడ్డు రకాలు మాత్రం –22.36 లక్షల టన్నులు కొన్నారు.
టార్గెట్ కష్టమే
సర్కారు కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు కొనకపోవడంతో ఈ యేడాది టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. మరో 10 లక్షల టన్నులు కొన్నా కూడా.. మొత్తంగా 45 లక్షల టన్నులు దాటే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఈ యేడు రైతులు దొడ్డు రకాలు తక్కువగా వేశారు. సర్కారు ఒత్తిడి చేయడంతో 60 శాతానికిపైగా రైతులు సన్న రకం వేశారు. కానీ ఇవే సన్నాలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనలేదు. దీంతో రైతులు మిల్లర్ల దోపిడీకి గురయ్యారు. మరోవైపు దొడ్డు రకాలు 25 లక్షల ఎకరాలకు
మించలేదు.
మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నరు
ఐకేపీ సెంటర్లలో సన్నాలు కొని లారీల్లో మిల్లులకు పంపితే ఐదారు రోజులు ఆపుతున్నరు. ఎందుకని అడిగితే ‘సన్నాలకు కాటిక రోగం వచ్చింది. మేము తీసుకోం’ అని బెదిరిస్తున్నరు. ‘బస్తాకు కిలో చొప్పున కట్ చేస్తాం. లారీకి 7 క్వింటాళ్లు ఇస్తేనే దించుకుంటం’ అని తిప్పలు పెడుతున్నరు. సివిల్ సప్లయ్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. ‘మిమ్మల్ని ఎవలు కొనమన్నరు’ అని తిడుతున్నరు. రైతుకు ఈ విషయం చెప్పి సముదాయించ లేక యాష్టకు వస్తాంది. అందుకే కొంటలేం.
– ఓ ఐకేపీ సెంటర్ నిర్వాహకురాలు