నత్తనడకన వడ్ల కొనుగోళ్లు

నత్తనడకన వడ్ల కొనుగోళ్లు
  • యాసంగిలో 25శాతం దాటని వడ్ల కొనుగోళ్లు
  • ఈ ఏడాది టార్గెట్​ 65 లక్షల టన్నులు
  • నిరుడు ఇదే టైంలో 36 లక్షల  టన్నులు కొన్నరు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొనుగోలు సెంటర్లకు వడ్లు పోటెత్తుతుండగా నెల రోజుల్లో కొన్నది 15.46 లక్షల టన్నులే. యాసంగి టార్గెట్‌‌ 65 లక్షల టన్నుల్లో ఇప్పటి వరకు 24.46 శాతమే వడ్లు కొన్నారు. నిరుడు మేలో ఇదే టైమ్‌‌కు 36.17 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. ఈయేడు కొనుగోళ్ల నిర్ణయం ఆలస్యం కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు ముందస్తు ఏర్పాట్లు లేక కొనుగోలు సెంటర్ల దగ్గర రైతులు ఇంకా అవస్థలు పడుతున్నారు.
160 సెంటర్లలోనే పూర్తయిన కొనుగోళ్లు
ఈ యాసంగిలో 6,834 సెంటర్లు ఏర్పాటు చేయాలని టార్గెట్‌‌ పెట్టుకోగా ఇప్పటి వరకు 6,117 సెంటర్లు తెరిచారు. ఇందులో 4,695 సెంటర్లలోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ నెల రోజుల్లో 160 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు పూర్తయ్యాయి. కొనుగోలు చేసిన వడ్లలో 14.91 టన్నులు మిల్లులకు చేరాయి. లారీలు రాక సెంటర్లలో వడ్ల కొనుగోళ్లు ముందుకు సాగడంలేదు. వడ్ల లోడ్లు మిల్లుల వద్ద దించకపోవడంతో అక్కడే లారీలు ఉండిపోతున్నాయి. ఒక్కో మిల్లుకు రోజుకు 15 నుంచి 20 లారీలు పోతే అందులో నాలుగైదు లారీలనే దింపుకుంటున్నారు. 
సెంటర్లలో ఇంకా సమస్యలే
కొనుగోళ్లు మొదలై నెల రోజులైనా సెంటర్లలో ఇంకా సమస్యలు ఉంటున్నాయి. లారీలు రాక, సెంటర్లలో వడ్లు కాంటా పెట్టక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా సెంటర్లలో టోకెన్లు లేవు. టార్పాలిన్లు లేవు. దీంతో సెంటర్లలో వడ్ల కుప్పలు నిండిపోతున్నాయి. తెచ్చిన వడ్లు వెంటనే కొని మిల్లులకు పంపించాలని రైతులు కోరుతున్నారు. కాంటా పెట్టిన వేల బస్తాల వడ్లు ఉన్నా.. వెళ్లిన లోడ్లను మిల్లర్లు దించుకోవడం లేదు.

ఈ విషయం అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఏం చేయాలని సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. రోజూ వడ్లు ఆరబోయడం.. సాయంత్రం కాగానే వర్షం వస్తుందని కుప్పలు పోయడం ఇదే సరిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సెంటర్లకు వడ్లు తెచ్చి 20 రోజులైనా కొంటలేరని ఆందోళన చెందుతున్నారు.