నకిలీ ట్రక్ షీట్లతో రూ.91 లక్షల ధాన్యం స్కాం..ఆరుగురు అరెస్ట్.. రూ.46.21 లక్షలు ఫ్రీజ్

నకిలీ ట్రక్ షీట్లతో రూ.91 లక్షల ధాన్యం స్కాం..ఆరుగురు అరెస్ట్.. రూ.46.21 లక్షలు ఫ్రీజ్

సిరిసిల్ల టౌన్, వెలుగు: ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లలో నకిలీ ట్రక్ షీట్లతో సుమారు రూ.91 లక్షల స్కాం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.14.16 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా, బ్యాంకు ఖాతాల్లోని రూ.46.21 లక్షలను ఫ్రీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేశ్​ బి.గితే తెలిపారు. 

ఎస్పీ వివరాల ప్రకారం, పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాం మేనేజర్ ఉత్కం విజయ్, సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్ వాసాల గణేశ్​ కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లను సృష్టించారు. రుద్రంగి ఐకేపీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి గడ్డం స్వామి రెండు లారీలకు నకిలీ చీటీలు జారీ చేయగా, వాటిని సివిల్ సప్లై వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసి ప్రభుత్వ నిధులు పొందారు. 

అలాగే డీఎంఓ కార్యాలయ కో-ఆర్డినేటర్ కమ్మరి రాజశేఖర్, బద్దెనపల్లి పీఏసీఎస్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి గాజుల నవీన్ కలిసి మరో లారీకి నకిలీ షీట్​ రూపొందించినట్లు తేలింది. వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండానే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దించినట్లు నమోదు చేసి, ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్​కు అప్పగించారు. 

అనంతరం సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ ద్వారా రైస్ మిల్లులకు విక్రయించి డబ్బు పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఉత్కం విజయ్, కమ్మరి రాజశేఖర్, చెపూరి మధుకర్, వాసాల గణేశ్, గాజుల నవీన్ తదితరులను రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.