తొగుట మార్కెట్​ యార్డులోకి  మల్లన్నసాగర్​ నీళ్లు

తొగుట మార్కెట్​ యార్డులోకి  మల్లన్నసాగర్​ నీళ్లు

కొట్టుకుపోయిన 300 క్వింటాళ్ల వడ్లు 

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: అధికారుల అనాలోచిత చర్యలతో అన్నదాత ఆగమైండు.  ఆరుగాలం కష్టించి పండించిన పంట రైతుల కండ్ల ముందే వరద నీటిలో కొట్టుకుపోయింది. సిద్దిపేట జిల్లా తొగుట వ్యవసాయ మార్కెట్ యార్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో మల్లన్న సాగర్ కట్ట నిర్మించారు. ఈ కట్టపై కురిసిన వర్షపు నీరు వెళ్లేందుకు కొంతమేర కాలువ నిర్మించారు. కూడవెల్లి వాగు వరకు ఈ కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో మూడు నెలల క్రితం కాంట్రాక్టర్ సమీపంలోని మార్కెట్ యార్డు కాలువకు దీనిని కలిపేశారు. వారం క్రితం చిన్న పాటి వర్షానికి మల్లన్న సాగర్ కట్టపై నుంచి వచ్చిన నీరు మార్కెట్ యార్డులోకి చేరడంతో వడ్లు తడిసిపోయాయి. రైతులు ఇరిగేషన్ అధికారులు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా తాత్కాలికంగా కాల్వను శుభ్రం చేసి వదిలేశారు. శనివారం సాయంత్రం మరోసారి కురిసిన భారీ వర్షంతో కట్ట పైనుంచి పెద్దఎత్తున నీరు మార్కెట్ యార్డు కాల్వ ద్వారా యార్డులోకి చేరింది. దాదాపు అర గజం ఎత్తులో వచ్చిన వరద ప్రవాహంతో యార్డులో ఆరబెట్టిన వడ్లతోపాటు కుప్పలు కొట్టుకుపోయాయి. 

  • 300 క్వింటాళ్ల వడ్లు..

తొగుట మార్కెట్ యార్డుకు 139 మంది రైతులు దాదాపు 11వేల క్వింటాళ్ల వడ్లను అమ్మకానికి తెచ్చారు. యార్డులోని షెడ్లలో దాదాపు ఆరు వేల క్వింటాళ్లను అమ్మకానికి పెట్టగా ఆరుబయట మరో ఆరు వేల క్వింటాళ్లు ఉంచారు. హఠాత్తుగా వచ్చిన వర్షానికి ప్రాజెక్టు కట్ట పైనుంచి వచ్చిన వరద తోడై వడ్లన్నీ కొట్టుకుపోయాయి. తొగుట గ్రామంలోని పలు రోడ్లపైకి వడ్లు చేరాయి. దాదాపు 40 మంది రైతులకు సంబంధించి 300 క్వింటాళ్లకు పైగా వరదలో కొట్టుకుపోగా కొందరు రైతులు రోడ్లపైకి చేరిన వడ్లను తట్టల్లో ఎత్తి యార్డులోకి తీసుకువచ్చారు. దాదాపు రూ. 6 లక్షల పైచిలుకు విలువైన వడ్లను రైతులు పూర్తిగా నష్టపోయారని అంచనా వేస్తున్నారు.