కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు మోడీ ఎందుకు పెట్టడం లేదు?

కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు మోడీ ఎందుకు పెట్టడం లేదు?

కరీంనగర్:  సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ జెండా మోసినోళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తాం తప్పా..వేరే వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తేలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వీణవంక మండల కేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.   గ్రామాల్లో సర్పంచ్,  ఎంపీటీసీ,  టీఆర్ఎస్  ముఖ్యనాయకులు ఇచ్చిన లిస్ట్ లో పేర్లు ఉన్న వారికే  మాత్రమే డబల్ బెడ్ రూమ్ లను  ఫైనల్ చేస్తామని అన్నారు.  వచ్చే రెండు నెలలలోపు సొంత ఇంటి స్థలం కలిగి ఉన్నవారికి సీఎం కేసీఆర్ మూడు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు. 

ఇప్పటికే గ్రామాలలో 50 కోట్ల వరకు అభివృద్ధి పనులను పూర్తి చేశామన్న కౌశిక్ రెడ్డి... వచ్చే ఎన్నికల లోపు మరిన్ని అభివృద్ధి పనులను కంప్లీట్ చేసి ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు.  తెలంగాణలో కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు.. గుజరాత్ లో ప్రధాని మోడీ ఎందుకు పెట్టడం లేదో  చెప్పాలని బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్ లను డిమాండ్ చేశారు.  గుజరాత్ లో బీజేపీ  ఏం అభివృద్ధి చేసిందో చెప్పడానికి  చర్చకు సిద్ధమా అని వారిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ చార్జ్  గెల్లు శ్రీనివాస్ యాదవ్,  ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.