
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన బీపీఎల్ కుటుంబాలకే రేషన్ కార్డులు ఇవ్వాలని సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 13.74 శాతం మాత్రమే బీపీఎల్ కుటుంబాలు ఉన్నాయని.. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోందన్నారు. ఇందులో 70 లక్షల కార్డులు రెండు కోట్ల మంది ప్రజల దగ్గర ఉన్నాయని ఆయన తెలిపారు. రేషన్ కార్డుల జారీలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కు గురువారం పద్మనాభరెడ్డి లేఖ రాశారు.
రెండు కోట్ల మందికి 6 కిలోల చొప్పున 12 కోట్ల కిలోల బియ్యం ప్రతి నెలా ఇస్తున్నారని.. ఇందులో రూ.600 కోట్ల విలువైన బియ్యం అనర్హులకు దక్కుతున్నాయని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇంటింటి సర్వే చేసి అనర్హుల రేషన్ కార్డులను తొలగించాలని ఆయన మంత్రిని కోరారు. బీపీఎల్ కుటుంబాలకు బియ్యం, కిలో పప్పు, ఒక కిలో నూనె ఇవ్వాలని ఆయన సూచించారు. రేషన్ బియ్యంను ఎవరూ తినడం లేదని, టిఫిన్ సెంటర్లకు, కోళ్ల ఫారాలకు అమ్ముతున్నారని లేఖలో ఆయన తెలిపారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌ను పద్మనాభరెడ్డి కోరారు.