అన్ని రంగాల్లో సికింద్రాబాద్​ను టాప్​లో నిలిపాం :   పద్మారావు గౌడ్

అన్ని రంగాల్లో సికింద్రాబాద్​ను టాప్​లో నిలిపాం :   పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, వెలుగు :  అన్ని రంగాల్లో సికింద్రాబాద్ సెగ్మెంట్​ను టాప్​లో నిలిపామని బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సెగ్మెంట్ పరిధిలోని డివిజన్ల కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు పద్మారావు గౌడ్​కు మద్దతుగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. గ్రేటర్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి, యువ నేతలు కిశోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, సీనియర్ నేతలు మోతె శోభన్ రెడ్డి, కరాటే రాజు, కంది నారాయణ, లింగాని శ్రీనివాస్​తో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.  

తొలుత సీతాఫల్ మండి నుంచి బైక్ ర్యాలీని పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 50 ఏండ్లలో జరగని అభివృద్ధిని పదేండ్లలో చేశామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో సికింద్రాబాద్​ను అభివృద్దిలో ముందంజలో ఉంచామన్నారు. రూ.72 కోట్లతో తుకారం గేట్ ఆర్​యూబీ నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. మరింత అభివృద్ధిని సాధించాలంటే  రేపు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరోసారి తనను గెలిపించాలని పద్మారావు గౌడ్ కోరారు.