
- పహల్గాం ఉగ్రదాడిపై ఇండియా దర్యాప్తుకు పాక్ సహకరించాలి
వాషింగ్టన్: పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని రెండు దేశాలకు అమెరికా సూచించింది. అలాగే, ఈ దాడిపై భారత్ చేస్తున్న దర్యాప్తుకు సహకరించాలని పాక్ కు హితవు పలికింది. టెర్రరిజంపై పోరులో ఇండియాకు అండగా ఉంటామని మరోసారి భరోసా ఇచ్చింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో బుధవారం వేర్వేరుగా ఫోన్ లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని జైశంకర్ తో చెప్పారు.
పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు తగ్గించుకునే దిశగా పనిచేయాలని కోరారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించాలని షెహబాజ్ కు రూబియో సూచించారు. భారత్ చేస్తున్న దర్యాప్తుకు సహకరించి, పొరుగు దేశంతో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని పేర్కొన్నారు. కాగా, స్వదేశాన్ని రక్షించుకునే హక్కు ఇండియాకు ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ తో పీట్ బుధవారం ఫోన్ లో మాట్లాడారు.
పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో ఇండియాకు మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు శిక్షణతో పాటు ఫండింగ్ ఇస్తోందని, ప్రపంచ దేశాలన్నీ పాక్ తీరును ఖండించాల్సిన అవసరం ఉందని రాజ్ నాథ్ తెలిపారు.